Cyber Crime | సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా పీఎం కిసాన్ పథకం పేరును వాడుకొని లింకులను పంపుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. జనంలో ప్రసిద్ధికెక్కిన పథకం పేరును వాడుతూ ఏపీకే(అండ్రాయిడర్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపించి నిలువునా దోచుకుంటున్నారు. కాబట్టి అవగాహన లేకుండా ఫోన్లలో వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల ఒక నిరుద్యోగ యువకుడి క్రెడిట్ కార్డు నుంచి ఎటువంటి ఓటీపీలు రాకుండానే 1.7 లక్షలు మాయమయ్యాయి.
ఇదంతా ఎలా జరిగిందని తన మొబైల్ ఫోన్‌ను పరిశీలిస్తుంటే అందులో పీఎం కిసాన్. ఏపీకే పేరుతో లింక్ డౌన్లోడ్ అయి ఉండడాన్ని గమనించాడు. ఆఫైల్ డౌన్లోడ్ కావడంతో తనకు తెలియకుండానే తన క్రెడిట్ కార్డులు ఉపయోగించి ఉంటారని, తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీలు కూడా సైబర్‌నేరగాళ్లు పరిశీలించుకొని, వాటిని ఆ తరువాత తొలగించి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్‌లో ఇన్స్టాలేషన్, సాప్ట్వేర్ అప్డేటట్లకు ఏపీఐ ఫార్మట్లలో ఫైల్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ ఫైల్స్లలో కోడ్ రాస్తూ కావాల్సిన అప్డేట్స్ చేయడం చేయడంతో యూజర్ దానిని తన సెల్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటాడు. అయితే దీనిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని అందులో వైరస్‌తో కూడిన సాప్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసి అమాయకులకు పంపిస్తున్నారు. తెలియని వాళ్లు ఈ ఫైల్స్‌ను క్లిక్ చేయడంతో వైరస్ ఆ ఫోన్లలో ఇన్స్టాల్ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అంతగా నమ్మదగిన ఫైల్ కాదు, ఇన్స్టాల్ చేసేటప్పుడు అపరేటింగ్ సిస్టమ్ అడుగుతుంది. అయితే కొందరు తెలిసి, మరికొందరు తెలియక ఈ ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింక్స్‌లో వైరస్‌తో కూడి సాప్ట్‌వేర్‌ను పంపించి ఫోన్‌నే సైబర్‌నేరగాళ్లు హ్యాక్ చేసే అవకాశముంది. ఈ లింక్స్‌ను క్లిక్ చేయవద్దని పోలీసులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఈ ఫైల్స్‌ను పంపిస్తూ బ్యాంకు ఖాతాలతో పాటు సెల్‌ఫోన్‌లోని ఇతర ముఖ్యమైన డాటాను సైతం నేరగాళ్లు అపహరించే అవకాశాలున్నాయని పోలీసులు సూచిస్తున్నారు.