వెంగళరావునగర్, ఫిబ్రవరి 18 – గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను ఎస్సార్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. స్థానికులను బుకీలుగా చేర్చి, నకిలీ సిమ్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి తైవాన్ కేంద్రంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టును ఛేదించారు. ఎస్సార్‌నగర్ పోలీసు స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్ స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి వివరాలను వెల్లడించారు. మాదాపూర్ కు చెందిన లింగాల అరుణ్ రాజ్(24)కు క్రికెట్ పై ఆసక్తితో, క్రికెట్ కంటెంట్ ను పంచుకునేందుకు ‘’క్రికెట్-360 మీడియా” అనే ఇన్స్టాగ్రామ్ పేజీని సృష్టించాడు. ఆ తరువాత అతన్ని ‘’గుగోబెట్ ఇండియా” అనే ప్రమోషనల్ వీడియో ఆకర్షించడంతో తైవాన్ జాతీయుడైన గ్రెగోరియా అనే ప్రధాన బుకీ నిర్వహిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాల్లో చేరాడు. ‘’హైపర్ టూల్” అనే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా లావాదేవీలను నియంత్రిస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అరుణ్ రాజ్ తన సోదరుడైన ఎస్.ఆర్.నగర్ లోని జయప్రకాష్ నగర్ లో నివాసం ఉండే లింగాల సాకేత్(23), స్నేహితుడైన మేకల సంజయ్ (22)లను కూడా బుకీలుగా చేర్చుకున్నాడు.
జయప్రకాశ్ నగర్ కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జయప్రకాష్ నగర్ లోని బుకీల ఇళ్లలో మంగళవారం దాడులు నిర్వహించారు. అరుణ్ రాజ్, సాకేత్, సంజయ్ ను అరెస్టు చేశారు. వీరితో పాటు తైవాన్ జాతీయుడైన ప్రధాన బుకీ గ్రెగోరియాతో పాటు నకిలీ సిమ్ కార్డులతో ఖాతాలు తెరచిన చిట్టిమల్ల అక్షయ్, రావుల రవితేజ, మహ్మద్ ముజమ్మిల్ అమన్, కొత్వాల్ సందీప్ కుమార్, బెగారి సతీష్, తల్లా అక్షయ్, పంజలాల భానుతేజ, మండల రాజ్ కుమార్, మట్టా సాయికృష్ణలపై కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.