ముషీరాబాద్, జనవరి 2 : మోహన్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, ఘంటసాల శత జయంతి ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో నిర్వహించిన అభినయ, నృత్య సంగీతోత్సవాలు, విష్ణు సహ స్రనామార్చన విశేషంగా ఆకట్టుకున్నది. ఎన్టీఆర్, ఘంటసాలకు నీరాజనం పలుకుతూ ప్రొ. జీఎం శ్రీదేవి, ఉషాకుమారి ఆలపించిన మధుర గీతాలాపన, విష్ణు సహ స్రనామార్చన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిధిగా పాల్గొని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి సంస్కృతీ శిఖర పురస్కారాలను ప్రదానం చేశారు. మోహన్ ట్రస్ట్ అధ్యక్షుడు పీఎంకే గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, రామ్‌దాస్, డీవీ రామయ్య, సుశీల్‌కుమార్, భరద్వాజ్, బుచ్చి రామయ్య, లక్ష్మణశర్మ, ప్రసాద్ శర్మ, మల్లు నాయుడు, కోనేటి సత్యం, జగదీశ్, విజయలక్ష్మీ, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.