Begumpet Police | బేగంపేట్, జూన్ 22 : దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే చోరీకి పాల్పడిన దొంగను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పనిచేసిన సంస్థలోనే కన్నం వేసిన ఈ ప్రబుద్ధుడు రూ. 46 లక్షలు అపహరించుకుని పారిపోయాడు. ఈ ఘటనను ఛాలెంజింగ్‌గా తీసుకున్న బేగంపేట పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి నుండి రూ. 46 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. బేగంపేట ఠాణా పరిధిలో పాటిగడ్డ సన్ స్టీల్స్‌లో మొన్న రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గతంలో అదే కంపెనీలో పనిచేసిన గిరిదారి సింగ్ అనే వ్యక్తి పలు కారణాలతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. మొన్న అర్ధరాత్రి సన్ స్టీల్స్ కంపెనీ వెనుక వైపు రంధ్రంలో నుండి అద్దాన్ని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు. అనంతరం లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న నగదును అపహరించుకొని బస్సులో పరారైనట్లు పోలీసులు తెలిపారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుడిని ఆదిలాబాద్‌లో గుర్తించి అక్కడి పోలీసుల సహకారంతో అతనిని అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌లో ఓ దాబా యజమాని ఇచ్చిన సమాచారం మేరకు బస్సు డ్రైవర్‌కు సమాచారం చేరవేయడంతో ఆదిలాబాద్ వరకు చేరుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకొని బేగంపేట పోలీసులకు అప్పగించారు.