Illegal Constructions | బేగంపేట: బేగంపేట డివిజన్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రధాన, అంతర్గత రోడ్లు అనే తేడా లేకుండా కొందరు నిర్మాణదారులు భవనాలను ఆరు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. రోడ్లను ఆక్రమించి భవనాలను మరీ రోడ్లపై వరకు నిర్మిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నది. బేగంపేట డివిజన్లోని కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి నుంచి ప్రేమ్‌సాగర్, మహావీర్ అపార్ట్‌మెంట్స్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి రోడ్డుపై వరకు భవన నిర్మాణాన్ని చేపట్టాడు. స్థానికులు సామాజిక మాధ్యమాల్లో అక్కడ తలెత్తుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అప్పటి వరకు మిన్నకుండిపోయిన బేగంపేట సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అ భవనాన్ని పరిశీలించారు. రోడ్డుపై నిర్మిస్తున్న భవన యజమాని నిర్మాణానికి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్నట్టు గుర్తించారు. అప్పటి వరకే గ్రౌండ్ ప్లస్ మొదటి అంతస్తు వరకు నిర్మాణం చేశారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు వెనువెంటనే నోటీసులు జారీచేసి.. ఆ భవన నిర్మాణాన్ని అడ్డుకున్నారు. నిర్మాణాన్ని నిలిపి వేశారు. నిలిపి వేసిన నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేసి.. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అక్కడి స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాగే బేగంపేటలో అనేక ప్రాంతాల్లో జీ ప్లస్ టూ అంతస్తులకు అనుమతులు తీసుకొని మరో రెండు మూడు అంతస్తుల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమంగా అదనంగా ఫ్లోర్స్ నిర్మిస్తున్న అక్రమదారులను గుర్తించి వాటి నిర్మాణాలు కూడా నిలిపి వేయాలని స్థానికులు కోరుతున్నారు.