బంజారాహిల్స్, ఆగస్టు 18: చిన్నపిల్లలు, వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న బెగ్గింగ్ మాఫియా ముఠాలోని కీలక వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్‌లోని కేబీఆర్ చెక్‌పోస్ట్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని పలు కూడళ్ల వద్ద గత కొంతకాలంగా యాచకుల సమస్య తీవ్రంగా మారింది. చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డుపైకి వస్తూ భిక్షాటన చేస్తుండటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్మైల్ ప్రాజెక్టు పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహించిన స్మైల్ ప్రాజెక్టు అధికారులు.. 28 మంది యాచకులను అదుపులోకి తీసుకుని రెస్యూ హోమ్‌లకు తరలించారు.
ఈ తనిఖీల్లో స్మైల్ ప్రాజెక్టు సభ్యులు లక్ష్మీ కవిత, కె.స్వప్న, సుజాత రాణితో పాటు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు. కాగా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌తో పాటు కేబీఆర్ పార్కు జంక్షన్ వద్ద భిక్షాటన చేస్తున్న వారి వద్దనుంచి వివరాలు సేకరించిన పోలీసులకు బెగ్గింగ్ ముఠాను నడిపిస్తున్న అనిల్ పవార్‌కు సంబంధించిన సమాచారం లభించింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన అనిల్ పవార్ (28) పార్థివాడలో నివాసం ఉంటూ బెగ్గింగ్ మాఫియాను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. చిన్నపిల్లలకు, వృద్ధులకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో వారిచేత భిక్షాటన చేయిస్తున్నాడన్న విషయం బయటపడింది. దీంతో బెగ్గింగ్ మాఫియా లీడర్ అనిల్ పవార్‌పై సెక్షన్ 27ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనిల్ పవార్ బావమరిది నౌకా కాలే కూడా ఈ రాకెట్లో కీలక పాత్ర పోషిస్తున్నాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని తెలిసింది.
ప్రధాన కూడళ్లలో ఒక్కో యాచకుడు రోజుకు రూ.6వేల నుంచి రూ.7 వేల వరకు సంపాదిస్తాడని, వారి సంపాదనలో 90 శాతం ప్రతిరోజు సాయంత్రం అనిల్పవార్ వచ్చి తీసుకెళ్తాడని పోలీసులు గుర్తించారు. అనిల్ పవార్‌తో పాటు ఇంకొందరు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా వీరికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న పోలీసులు.. అనిల్ పవార్ వద్దనుంచి వివరాలు సేకరిస్తున్నారు.