రవీంద్రభారతి, మే21: ఇంజనీరింగ్ విద్యలో బీసీ విద్యార్థులకు 10వేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
2008లో అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి ఫీజు రియింబర్స్‌మెంట్‌ను సాధించామని, బీసీ-ఈలో ఉన్న ముస్లిం మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులు ఇస్తున్నారని, బీసీ విద్యార్థులకు మాత్రం 10,000 ర్యాంకు నిబంధన పెట్టి మిగిలిన వారికి కేవలం 35,000 మాత్రమే ఇస్తున్నారని దానివల్ల టాప్-10 కాలేజీలో బీసీ విద్యార్థులకు సీట్లు వచ్చినప్పటికీ ఫీజులు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ఉండడంతో కట్టలేక చదువులకు దూరమవుతున్నారని విక్రమ్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ర్యాంక్ నిబంధనలు ఎత్తివేస్తామని, మిగతా ఎస్సీ,ఎస్టీ , మైనార్టీ విద్యార్థుల లాగే బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు చెల్లిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌తో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని ఆయన గుర్తు చేశారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 10వేల ర్యాంక్ నిబంధనను ఎత్తివేసి బీసీలకు న్యాయం చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని విక్రంగౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు.. కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, గొడుగు మహేష్ యాదవ్, ఇంద్రం, రజక విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.