ఖైరతాబాద్, మార్చి 22 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఢిల్లీ సాకులు చెప్పి రిజర్వేషన్ల అమలును పక్కన పెట్టాలని చూస్తోందని బీసీ జన సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవోలు జారీ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ జనసభ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘బీసీ బిల్లు- స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో తక్షణమే రిజర్వేషన్ల అమలుకోసం ఉద్యమ కార్యాచరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు డి. రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉండేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పాట పాడుతున్నారని ఆరోపించారు. కొంతమంది తాబేదారులను పెట్టుకొని సన్మానాలు, చప్పట్లు కొట్టించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అసలు బీసీ ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీపై రాజీలేని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కులగణన చేసి చేతులు దులపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని బీసీ సమాజానికి తెలియజేస్తామని అన్నారు. కోర్టుల బూచి చూపి 9వ షెడ్యూల్ పేరుతో బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం రాష్ట్ర రాజధాని నుంచి గ్రామాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీనికి బీసీ సంఘాలు, కుల సంఘాలు, పార్టీల కతీతంగా బీసీలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ అంశాన్ని డిల్లీ వైపు మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుందని మండిపడ్డారు. అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత గవర్నర్‌తో ఆర్డినెన్స్ తీయించి, జీవోల ద్వారా ఇక్కడ బీసీ రిజర్వేషన్లను అమలు చేయవచ్చని వివరించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 242డి లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చని స్పష్టంగా ఉందన్నారు. అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ఇక్కడ కులగణన కూడా జరిగిందని, రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నా ఢిల్లీ మీద భారం ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు 50 శాతం సిలీంగ్ అనేది ఔట్‌డేటెడ్ అని, మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వాలు ఆ లిమిట్‌ను పెంచుకోవచ్చని స్వయం అత్యున్నత న్యాయస్థానమే అభిప్రాయపడిందని గుర్తుచేశారు. అంతేకాకుండా శాస్త్రీయంగా జనాభా లెక్కలు ఉంటే ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని చెప్పిందన్నారు. అన్ని అవకాశాలు ఉన్నా కేవలం కుట్రపూరితంగా ఆ వర్గాలకు న్యాయకత్వం ఇవ్వాల్సి వస్తుందనే ఈ అంశాన్ని పక్కనప పెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. బీసీ ఉద్యమం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయవచ్చని, కానీ ఆ ఆలోచన చేయడం లేదని తెలిపారు.
సామాజిక ఉద్యమకారులు వీజీఆర్ నారగోని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసిన వెంటనే జీవోలు జారీ చేసి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అమలు చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా కేంద్రంపై ఆ భారాన్ని నెట్టివేసి చేతులు దులుపుకోవాలనే ఆలోచనలో ఉందన్నారు. జీవోలను ప్రశ్నిస్తూ ఎవరైనా అగ్రవర్ణాలకు చెందిన వారు కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు నుంచి న్యాయవాదులను రప్పించి తమ వాదనలు వినిపించాలన్నారు. కోర్టు కొట్టివేస్తుందన్న సాకుతో అమలు చేయకుండా ఉండాలని చూస్తే ఒప్పుకోమని తెలిపారు. బీహార్‌లో అక్కడి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 62 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే కోర్టు కొట్టివేసిన క్రమంలో సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నారని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన శాస్త్రీయమైందని అభిప్రాయపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ సబ్‌ప్లాన్ హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుత కులగణన ప్రకారం మంత్రివర్గంలో సీట్లు పెరగాలని, బడ్జెట్‌ను పెంచాలని, అన్ని ప్రభుత్వం చేతుల్లోనే ఉందని, వీటికి ఎలాంటి అడ్డంకులు లేవని తెలిపారు. సుమారు 78 సంవత్సరాల నుంచి బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తూ వస్తోందని, మళ్లీ అదే మోసాన్ని కొనసాగిస్తుందని ఆరోపించారు.
గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు బి. సంజీవ్ నాయక్ మాట్లాడుతూ.. బీసీల రాజ్యాధికారం వచ్చినప్పుడు అందరి బతుకులు మారుతాయని అన్నారు. లక్ష రూపాయల రుణం కోసం 24 గంటలు మీ సేవ ముందు బీసీ బిడ్డలు వేచి ఉండాల్సి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. మండల కమిషన్, ఇంద్రసహాని తీర్పు పేరు చెప్పి 50 శాతం దాటవద్దని అంటున్నారని, బీసీలు 29, ఎస్సీలు 15, ఎస్సీలు 10 శాతం కలిపి ఈ రాష్ట్రంలోనే 54 శాతం అమలవుతుందని చెప్పారు. దీనికి తోడు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి బిల్లు పాస్ చేయించాలని, కాని ఆ పనిచేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నది అధికార ప్రభుత్వమేనన్నారు. గ్రూప్ 2లో బీసీలకు హైదరాబాద్ తప్పితే ఇతర ఏ జోన్లలో ఉద్యోగాలు రాలేదన్నారు.
కవి, రచయిత జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బీసీల చూట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు బీసీలను ముక్కలు చేసి లబ్దిపొందుతున్నాయని తెలిపారు. 9వ షెడ్యూల్ కోసం తమిళనాడు స్థాయిలో ప్రయత్నాలు జరగాలని అన్నారు. బీసీల ఉద్యమం గల్లీ స్థాయి నుంచి డిల్లీ స్థాయికి చేరాలన్నారు. ప్రస్తుతం ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు తాత్కాలికం మాత్రమేనని, 56 శాతం కోసం పోరాడాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్‌ను అధికారంలోకి నిలబెట్టిందన్నారు. అది అమలు కాకుంటే అధికారాన్ని సైతం కోల్పోతుందన్నారు. బీసీలరాజ్యాధికారం కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలన్నారు.
తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం తర్వాత బీసీ ఉద్యమం అంతటి ప్రభావాన్ని చూపుతుందని, అది దేశంలోని బీసీ ఉద్యమాలకు దిక్సూచి అవుతుందన్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకోవడం వల్లే ఇక్కడ కులగణన జరిగిందని, కాని భారతదేశంలోనే అతి పెద్ద బీసీ వ్యతిరేకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, ఆయన నరనరాల వ్యతిరేకత ఉందని ఆరోపించారు. కులగణన, బీసీ బిల్లు చిత్తశుద్దితో చేయలేదని, కేవలం అధిష్టానం ఒత్తిడి మేరకే చేశారన్నారు. రేవంత్ రెడ్డి మరో సారి బీసీలను అడ్డుపెట్టుకొని లబ్దిపొందాలని చూస్తున్నారని, దానికి కొంత మంది బీసీ నాయకులు వంత పాడుతున్నారని అన్నారు. ఇక ముందు ఆ ఆటలు సాగనివ్వవద్దని, ఆ కుట్రలు తిప్పి కొట్టి రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ మాట్లాడుతూ.. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.