ఖైరతాబాద్, జూలై 23:స్వాతంత్య్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జర్నలిస్టులు ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. బీసీ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం జరిగింది. తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో వివిధ పత్రికలు, టీవీ చానెళ్లలో పని చేస్తున్న వారిలో 80 శాతం మంది బీసీ జర్నలిస్టులే ఉన్నారన్నారు.
వారి కృషితోనే నేడు ఆయా ప్రసార మాధ్యమాల మనుగడ కొనసాగుతున్నదన్నారు. ప్రధానంగా డిజిటల్ మీడియాలో బీసీ జర్నలిస్టులే అగ్రభాగాన ఉన్నారన్నారు. ప్రభుత్వం ఆయా మాధ్యమాల్లో అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు, చిన్న పత్రికలకు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ తరపున బీసీ జర్నలిస్టుల కోసం రెండు రోజుల ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను చైతన్యపర్చడంలో బీసీ జర్నలిస్టులు కీలకపాత్ర పోషించాలన్నారు.
ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల నీలకంఠం మాట్లాడుతూ.. బీసీలు కులాలవారీగా విడిపోతే రాజ్యాధికారం సాధించలేమన్నారు. గ్రామాలు, మండలాలవారీగా బీసీలను ఐక్యత చేసే కార్యాచరణను జర్నలిస్టులు తీసుకోవాలని, సామాజిక మాధ్యమాన్ని ఆసరా చేసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపర్చడంలో జర్నలిస్టులు విశేష పాత్ర పోషించారన్నారు. 56.5 ఉన్న బీసీలకు కేవలం 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని, ఐదు శాతం ఉన్న వారు రాజ్యమేలుతున్నారన్నారు. ముందుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని బీసీలు ఉద్యమించాలన్నారు.
బీసీ జర్నలిస్టుల ఐక్యతను చాటుతూ త్వరలోనే పది వేల మందితో సభను నిర్వహిస్తామన్నారు. విశ్వకర్మ జర్నలిస్టు సంఘం అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, యాదవ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న జీవో ప్రభుత్వం తీసుకువచ్చిందని, అది వారి దయాదాక్షిణ్యం కాదని, విద్యాహక్కు చట్టంలోనే 50 శాతం ఇవ్వాలన్న నిబంధన ఉందన్నారు. అది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కనబడటం లేదన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్, యూనియన్లు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ దాదె వెంకట్ పటేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు సంఘం అధ్యక్షులు తూములూరి సత్యనారాయణ, గౌడ జర్నలిస్టు సంఘం ప్రతినిధి సీఆర్ జానకిరామ్, క్షత్రియ సమాజ్ జర్నలిస్టు సంఘం ప్రతినిధి భవ్ సార్, సీనియర్ జర్నలిస్టులు సంపత్, శ్రీనివాస్, ఎం.ప్రభాకర్ ముదిరాజ్, బోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.