తెలుగు యూనివర్సిటీ, జనవరి 10 : సమాజానికి క్షౌరవృత్తితో సేవ చేస్తున్న నాయీబ్రాహ్మణుల (మంగలి)సెలూన్లకు దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేయడం గొప్ప విషయమని తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. నాయీ బ్రాహ్మణ రాష్ట్ర సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభ తెలంగాణ సారస్వత పరిషత్తులో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. నాగరికత రూపకల్పనలో నాయీబ్రాహ్మణుల సేవలు అనాదిగా కొనసాగుతున్నాయని అన్నారు. క్షౌరవృత్తితో పాటు ధన్వంతరి వైద్యం, పురుడుపోయడం, మంగళవాయిద్యాలు తదితర మహోన్నత సేవలను సమాజానికి అందిస్తున్న మంగలి కులస్తులకు రుణపడి ఉండాలని అన్నారు.
నాయీ బ్రాహ్మణులు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్ష ,దాడులు తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ కృష్ణమోహన్‌రావుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టాల యాదగిరి, ఉపాధ్యక్షుడు కె. ఈశ్వర్, ఎస్.రామానంద స్వామి, ముల్లుగాళ్ల గుర్రప్ప, ఎం.రమేశ్, భూపాల్‌రాజు, సహాయ కార్యదర్శులు కె. హరినాథ్, ఎస్.శ్రీనివాస్, కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.