కూకట్పల్లి, అక్టోబర్4: గ్రామ సంప్రదాయం మేరకు అమావాస్యకు ఒకరోజు ముందు మొదలయ్యే బతుకమ్మ పండుగ సంబురాలు సోమవారం కూకట్పల్లిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మలు, బొడ్డెమ్మలతో పెద్ద సంఖ్యలో స్థానిక హనుమాన్ ఆలయం మైదానంలోకి వచ్చిన మహిళలు ఆట, పాటలతో సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఐడీఎల్ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. గ్రామ ఆచారం మేరకు ఇక్కడ ఒకరోజు ముందే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంభిస్తారు. అయితే, మంగళవారం సాయంత్రం 7 గంటల తర్వాత అమావాస్య వస్తుండటంతో సోమవారం సాయంత్రమే వారు బతుకమ్మ నిర్వహించారు.
సికింద్రాబాద్/కవాడిగూడ, అక్టోబర్ 4: మహిళల అభిరుచికి అనుగుణంగా బతుకమ్మ చీరలు ఉన్నాయని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ అన్నారు. బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి ఆమె సందర్శించి చీరలను పరిశీలించారు. కవాడిగూడ బండమైసమ్మనగర్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శైలజారామయ్యర్, స్థానిక కార్పొరేటర్ జి.రచనశ్రీతో కలిసి పరిశీలించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చీరల పంపిణీ కొనసాగుతున్నది. బతుకమ్మ కానుకగా సర్కారు అందించిన చీరలను సోమవారం అతివలు మురిపెంగా అందుకున్నారు. ప్రభుత్వం అందించిన రంగు రంగుల డిజైన్లు, జరీ అంచులను చూస్తూ సంబురపడ్డారు. తనతో వచ్చిన అక్కా చెల్లెళ్లకు వాటిని చూపుతూ ఆనందపడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగా ఉండాలంటూ దీవెనలు అందించారు. కాగా, సోమవారం ఒక్కరోజే 1,06,974 చీరలను పంపిణీ చేయగా, మూడు రోజుల వ్యవధిలో 2,67,738 చీరలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.