రంగురంగుల పూలు రంగవల్లులై.. తంగేడు గునుగులు వాకిలంతా నిండి.. ఆశ్వయుజంలో ఆటపాటలతో వీధులన్నీ తిరునాళ్లుగా మారితే అది బతుకమ్మ సంబురమే. పెత్రమాస (పితృ అమావాస్య) నాడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు సాగే ఈ వేడుక తెలంగాణకే ప్రత్యేకం. బుధవారం నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ వేడుకలను ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మంగళవారం సాయంత్ర మే ఆటపాటలతో పరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయె చందమామ’ వంటి సంప్రదాయ గీతాలు ఆలపిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ మండల ఉప విద్యాధికారి ఎం.సామ్యూ ల్ రాజ్, డిప్యూటీ ఐవోఎస్ స్వరూపరాణి, హెచ్ఎంలు ఎం.నరేందర్ యాదవ్, జాబేర్, పీఈటీ కిశోర్ పాల్గొన్నారు.