సిటీబ్యూరో/జీడిమెట్ల/మలక్‌పేట, జూన్15 (నమస్తే తెలంగాణ): వారంతా ఒకే కుటుంబానికి చెందిన ఇరవై 20 ఏండ్లలోపు యువకులు.. కుటుంబమంతా కలిసి బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. గోదావరిలో పుణ్యస్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగారు. ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువకులు ఆదివారం బాసరలో గోదావరినదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. రాజస్థాన్‌కు చెందిన మూడు కుటుంబాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నాయి. ఆదివారం బాసర అమ్మవారి దర్శనానికి ఆ కుటుంబాలకు చెందిన 18 మంది వెళ్లారు.
ఈ సందర్భంగా ఐదుగురు యువకులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తుండగా, గల్లంతయ్యారు. గోదావరిలో తేలిన ఇసుక మేట వద్దకు చేరుకుని స్నానాలు చేస్తుండగా, లోతైన ప్రాంతంలో మునిగి చనిపోయారని పోలీసులు చెప్పారు. దిల్సుఖ్నగర్ శాలివాహననగర్ చెందిన కిరాణా వ్యాపారి ప్రవీణ్ తమ్ముడు రితిక్(22), అతని బంధువు మోహన్(19) ,కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు రాకేశ్ (20), మదన్ (18), భరత్ (16) గోదావరి నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందారు. చనిపోయినవారంతా దగ్గరి బంధువులు కావడం.. ఒకే కుటుంబం నుంచి ముగ్గురిని కోల్పోవడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచి వేసింది.