హిమాయత్‌నగర్, అక్టోబర్ 22: ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా తమ బ్యాంకు విస్తృత సేవలను అందిస్తున్నట్లు బ్యాంకు ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగానే రైతులకు పెద్ద పీట వేస్తూ వారికి కావాల్సిన అన్ని రకాల రుణాలను అందించడంలో తమ బ్యాంకు ముందజలో ఉందన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదర్‌గూడలోని బ్యాంకు ఆఫ్ బరోడాలో జోనల్ కార్యాలయంలో ‘బరోడా కిసాన్ పక్వాడ్’ 4వ ఎడిషన్‌ను ప్రారంభించారు.
అనంతరం, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2021-22 సంవత్సరాల్లో రుణ అభివృద్ధిలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. దీనిలో భాగంగా గోల్డ్ లోన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్లను ఇచ్చినట్లు తెలిపారు. గోల్డ్ లోన్ సెగ్మెంట్లో వార్షిక రూపేణ 11 శాతం ఎదుగుదలతో రూ.650 కోట్లు, స్వయం సహాయక బృందాల సెగ్మెంట్లో 6% రూ.54.96 కోట్ల లాభాలను రాబట్టామని తెలిపారు. దేశంలోనే 4వ అతి పెద్ద బ్యాంకుగా తమ బ్యాంకు ఉందని గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వివరించారు. ఖాతాదారులకు బ్యాంకు సేవలను అందిస్తూ గ్రామీణ రైతుల అవసరాలను గుర్తించి సకాలంలో రుణ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిప్యూటీ జోనల్ మేనేజర్ వినోద్ బాబు, డీజీఎం శ్రీనివాసులు, ఏజీఎం ప్రశాంత్ సిన్హా పాల్గొన్నారు.