బంజారాహిల్స్, మే 20: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి, విదేశీయులకు ఇండ్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాల్సిందేనని బంజారాహిల్స్ డీఐ బషీర్ అహ్మద్ సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని సింగాడకుంటలో బస్తీవాసులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంజారాహిల్స్ డీఐ బషీర్ అహ్మద్ మాట్లాడుతూ.. బస్తీల్లో, కాలనీల్లో ఇండ్లు అద్దెకు ఇచ్చే సమయంలో కచ్చితంగా వారికి సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలన్నీ తీసుకోవాలని సూచించారు.
బెంగాల్, అస్సాం, నేపాల్, యూపీ, బిహార్, ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ నేరాలకు పాల్పడితే వారికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని డీఐ బషీర్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తవారు ఎవరు వచ్చినా వారి వివరాలను స్థానిక పోలీసులకు పంపిస్తే నేరచరిత్ర ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. బంగ్లాదేశ్తో పాటు ఇతర దేశాల నుంచి కొంతమంది అక్రమంగా వలస వచ్చి ఇక్కడే ఉంటున్నారని, అలాంటి వారికి ఆశ్రయమిస్తే ఇంటి యజమానులు కూడా కష్టాల్లో పడటం ఖాయమన్నారు. అనుమానాస్పదంగా కనిపించేవారికి సంబంధించిన సమాచారాలను స్థానిక పోలీసులకు చెప్పాలని సూచించారు. అద్దెలకు ఇండ్లు ఇచ్చేవారు కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.