సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ప్రమాదకరంగా మారిన భవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. వానకాలం నేపథ్యంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 224 శిథిల భవనాలను గుర్తించారు. ఈ భవనాలలో మరమ్మతులు చేయాల్సినవి, కూల్చివేసినవి వేర్వేరుగా సిద్ధం చేసిన అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. గతేడాది 231 శిథిల భవనాలను కూల్చివేయగా.. 294 భవనాలకు మరమ్మతులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది కూడా శిథిల భవనాల విషయాన్ని సీరియస్గా తీసుకొని ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్షాకాల విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పురాతన భవనాల పటిష్టత, భద్రతపై ఇంజినీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, అత్యంత ప్రమాదకరమైన భవనాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ డ్రైవ్లో భాగంగా పురాతన భవనాలపై జోన్ల వారీగా సర్వే సంబంధిత భవన నాణ్యతను పరిశీలించి ప్రమాదకర భవనాలకు నోటీసులు జారీ చేయడం, ప్రమాదకర భవనాలను కూల్చివేయనున్నట్లు అధికారులు చెప్పారు.