సిటీబ్యూరో/బంజారాహిల్స్, డిసెంబర్ 16: నగరంలోని పలు కూడళ్లలో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం కేబీఆర్ పార్కు వాక్‌వేలో ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్ రోనాల్డ్ రాస్ అక్కడ మురుగు సమస్యలను గుర్తించారు. వాక్‌వేలో అపరిశుభ్రత కనిపిస్తోందని, మురుగు సమస్యలు పరిష్కరించడంతో పాటు వాకర్లకు ఆహ్లాదాన్ని పంచేలా చూడాలని ఆదేశించారు. దీంతో పాటు వాకర్లకు అవసరమైన సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు.
అనంతరం సోమాజిగూడ, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పట్టిన అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. జంక్షన్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమైన అన్ని జంక్షన్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే, యూబీడీ అదనపు కమిషన్ కృష్ణ, ఎస్ఈ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.