హిమాయత్‌నగర్, జూన్ 28: అకారణంగా ఇద్దరు అన్నదమ్ములను నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేసి దాడికి పాల్పడిన బాలాపూర్ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి, బాధితులకు న్యాయం చేయాలని పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని పౌరులను హింసించడం చట్ట విరుద్ధమన్నారు.ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలాపూర్ పీఎస్ పరిధిలోని మహ్మద్‌నగర్‌లో నివాసముండే బాధితులు మహ్మద్ జహంగీర్, మహ్మద్ అబ్దుల్లా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మాట్లాడారు.
మహ్మద్ జహంగీర్, మహ్మద్ అబ్దుల్లా అన్నయ్య మహ్మద్ అసద్ పలు నేరాలకు పాల్పడటంతో 2025 సెప్టెంబర్ 13న అతనిపై పోలీసులు నగర బహిష్కరణ చేశారన్నారు. మహ్మద్ అసద్ ఎక్కడ ఉన్నాడో.. అతని ఆచూకీ తెలుపాలని ఈ నెల 23న అర్ధరాత్రి బాలాపూర్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై.. మహ్మద్ జహంగీర్, మహ్మద్ అబ్దుల్లాలను ఇంటి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి చీకటి గదిలో ఉంచి తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు.
పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన బాధితులు ఇద్దరు నడవలేని స్థితిలో ఉన్నారని, వీరిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ తెరుస్తామని భయభ్రాంతులకు గురి చేయడంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ చేసి బాలాపూర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సీఎం,డీజీపీ సీవీ ఆనంద్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రతినిధులు మహ్మద్ హమీద్, సయ్యద్ సలీం,సయ్యద్ యాకుబ్ పాల్గొన్నారు.