బడంగ్‌పేట, మే 21: నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ట్యాంకులు నడిపిస్తే చర్యలు తప్పవని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి హెచ్చరించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో అక్రమంగా నీటి రవాణా చేస్తున్న వాటర్ ట్యాంకర్లను సీజ్ చేశారు. వివిధ కాలనీవాసుల అసోసియేషన్ ఫిర్యాదు మేరకు వ్యవసాయ కులాల పేరుతో నీటి దందా కొనసాగిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో బోర్లను సీజ్ చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ ప్రశాంతి బోర్లను, వాటర్ ట్యాంకర్లను సీజ్ చేశారు. వాటర్ ఫిల్టర్లు కూడా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫిల్టర్లు ఏర్పాటు చేయడంపై ఆమె మండిపడ్డారు. వాటర్ ఫిల్టర్లపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా వాటర్ ఫిల్టర్లు వెలుస్తున్నాయని అన్నారు.
అక్రమ బోర్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని విద్యుత్ అధికారులకు తహసీల్దార్ ఇందిరా దేవి ఆదేశించారు. మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ బోర్లు, అక్రమ వాటర్ ట్యాంకర్ల జాబితాను ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. వాటర్ ట్యాంకర్లు, బోర్లకు సంబంధించిన సమాచారం అంతా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారుల దగ్గర ఉంటుందని మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగిందని తహసీల్దార్ పేర్కొన్నారు. ఇది విషయంపై హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు అక్రమ నీటి దందా గురించి సమాచారం అందజేసినట్లు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు నీటి వ్యాపారం చేయకుండా హెచ్ఎమ్ డబ్బులు ఇస్తే అధికారులే అవసరమైన వారికి నీటి సరఫరా చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
బోర్లు సీజ్ చేసిన తరువాత కూడా యథావిధిగా ట్యాంకర్లు నడపడంపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్ చేసిన తర్వాత కూడా ట్యాంకర్లు నడిపిస్తే కేసులు నమోదు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఈ అక్రమాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు సహకరించాలని తహసీల్దార్ కోరారు. బోర్ల ద్వారా అక్రమ నీటి వ్యాపారం చేయడం వల్ల తమ బోర్లు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని కాలనీవాసులు ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.