Balapur Laddu | హైదరాబాద్ : బాలాపూర్ గణేశుడి లడ్డూ కోసం ఆరేళ్లుగా ప్రయత్నిస్తున్నాని లడ్డూ విజేత లింగాల దశరథ గౌడ్ పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బాలాపూర్ గణేశ్ అంటే తనకు చాలా ఇష్టమని, గత కొన్నేండ్ల నుంచి ఇక్కడికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ ఆ భగవంతుడు నాకు లడ్డూను దక్కించాడు.. చాలా సంతోషంగా ఉందని లింగాల దశరథ గౌడ్ పేర్కొన్నారు. లడ్డూ విజేత దశరథ గౌడ్‌ను ఉత్సవ కమిటీ సన్మానించింది. రూ. 35 లక్షల నగదును ఉత్సవ కమిటీకి దశరథ గౌడ్ అందించారు.
రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ గణేశుడి లడ్డూ మరోసారి భారీ ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలం పాటలో రూ.35 లక్షలకు కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది గతేడాదికంటే రూ. 4.99 లక్షలు అధికం. 2024లో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితికి చెందిన కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 38 మంది పాల్గొన్నారు. వారిలో ఏడుగురు స్థానికేతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.