Balapur Laddu | వినాయక చవితి వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. మంగళవారంతో నవరాత్రి వేడుకలు ముగియనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ జంట నగరాల్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల వినాయక లడ్డూ వేలాల నిర్వహణ జరుగుతున్నాయి. లడ్డూవేలం అనగానే అందరికీ బాలాపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏయేడాది కాయేడు రికార్డు ధరల పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వేలం జరుగనుండగా.. ఈ సారి రికార్డు ధర రానున్నట్లు అంచనా. బాలాపూర్‌లో గణేషుడికి భారీ లడ్డూ నైవేద్యంగా పెట్టే సంప్రదాయం 1980లో మొదలైంది. లడ్డూవేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు.
ఆ సమయంలో రూ.450 ధర పలికింది. చివరి ఏడాది రికార్డు స్థాయిలో రూ.27లక్షలకు పెరిగింది. బాలాపూర్ లడ్డూ బరువు 21 కిలోలు. తాజాగా లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధనను తెచ్చారు. ఈ సారి అయోధ్య రామమందిరం నమూనాలో ఏర్పాటు చేసిన మండపంలో బాలాపూర్ గణపతి కొలువుదీరి పూజలందుకుంటున్నారు. మంగళవారం చివరి పూజ అనంతరం బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలంపాటను బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించనున్నది. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.
1994లో తొలిసారిగా లడ్డువేలం జరిగింది. రూ.450కి కొలను మోహన్‌రెడ్డి అనే వ్యక్తి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయనే రూ.4500కి వేలంపాడారు. 1996లో నాలుగు రెట్లు పెరిగి రూ.18వేలకు చేరింది. 1998 వేలంలో లడ్డూ రూ.50 వేలు మార్క్‌ని దాటింది. కొలను మోహన్ రెడ్డి రూ.51 వేలకు లడ్డూ సొంతం చేసుకున్నారు. 2001లో బాలాపూర్ లడ్డూ రూ.లక్ష దాటింది. కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. 2007లో లడ్డూ రూ.5లక్షల మార్క్ చేరింది. కొలను మోహన్ రెడ్డి రూ.5.07 లక్షలకు వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. 2014లో ఏకంగా రూ.10లక్షలకు చేరింది. ఆ ఏడాది కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10.32లక్షలకు దక్కించుకున్నారు. 2015లో స్కైలాబ్ రెడ్డి రూ.14.65 లక్షలకు, 2016లో నాగం తిరుపతి రెడ్డికి రూ.15.60 లక్షలకు వేలం పాడారు. 2022లో రికార్డు స్థాయిలో రూ.20 లక్షలు దాటింది. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి వేలంపాటలో రూ.24.60లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. ఇక చివరిసారిగా 2023లో దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సారి రూ.30లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.