సిటీబ్యూరో,ఏప్రిల్11(నమస్తే తెలంగాణ) : యాభై వేల నుంచి లక్ష రూపాయలుంటేనే ఆన్లైన్ బెట్టింగ్‌లో పాల్గొనాలి.. లేదంటే మా వైపే చూడొద్దంటూ ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్లో కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.66.28లక్షల నగదుతో కలిపి సుమారు కోటి రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. విజయవాడకు చెందిన పాండు ప్రధాన నిర్వాహకుడు, ఇతడడి కింద యూసుఫ్‌గూడకు చెందిన వై.వెంకట శివరామ కృష్ణ, సింగమనేని కిరణ్‌కుమార్, బంజారాహిల్స్‌కు చెందిన నందమ్ శ్రీనివాస్ బాబు బుకీలుగా పనిచేస్తుండగా కడియాల మహేశ్, చేరెడ్డి కాసి, అడ్డెపల్లి ప్రతాప్ ఘనకుమార్, కె.విజయ్‌కుమార్, శ్రీకాంత్, ఎ.వినయ్, బి.వెంకటరత్నకుమార్ సహాబూకీలుగా పనిచేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతోనే బాచుపల్లి ప్రాంతంలోని సాయి అనురాగ్ కాలనీలో ఓ ఇంట్లో బెట్టింగ్‌కు సంబంధించిన అడ్డాను ఏర్పాటు చేసుకున్నారు.
ఒకే సారి 36 మందితో మాట్లాడే విధంగా లైన్ బోర్డులు మూడు ఏర్పాటు చేశారు. ఒకేసారి ఈ మూడు బోర్డుల నుంచి 108 మందితో మాట్లాడవచ్చు. వీళ్ల గురించి తెలిసిన వారు, వారికున్న పరిచయాలతో ఫోన్లు చేసి బెట్టింగ్ చేసే వారు కొందరుంటారు. అలాగే గూగుల్‌లో బెట్టింగ్ గురించి సర్చ్ చేశారంటూ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆ సర్చ్ చేసిన వ్యక్తి కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌కు క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన ప్రకటన పంపిస్తుంటారు. అప్పటికే ఎంతో కొంత అసక్తి ఉన్నవారు ఆ ప్రకటనను క్లిక్ చేయడంతో ఓ నెంబర్ అందులో ఉంటుంది. దానికి ఫోన్ చేయడంతో బెట్టింగ్‌కు సంబంధించిన విషయం మాట్లాడేందుకు ప్రత్యేక నంబర్‌ను కేటాయిస్తారు.
కనీసం రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు ఉంటేనే బెట్టింగ్‌లో పాల్గొనాలని, అంతా ఆన్లైన్లోనే ఉంటుందని చెబుతారు. బెట్టింగ్ అడ్డాలో ఉన్న వారు తమ ఫంటర్లతో నిరంతరం మాట్లాడుతుంటారు. కొందరు మ్యాచ్ మొత్తానికి బెట్టింగ్ పెడుతుండగా, మరికొందరు బాల్, బాల్‌కు, ఇంకొందరు ఓవర్ లెక్కన, ఇలా వివిధ రకాలైన బెట్టింగ్ పెడుతుంటారు. ఆన్లైన్లో బెట్టింగ్‌లో పాల్గొనే వారికి ప్రత్యేక యాప్‌ను అందిస్తారు. ఒక పక్క ఫోన్లో మాట్లాడుతూ బాల్ బాల్‌కు బెట్టింగ్ చెబుతుంటే బెట్టింగ్ అడ్డాలో ఉండే సహాబూకీలు ఫంటర్లు చెప్పే వివరాలతో ఎప్పకటిప్పుడు యాప్‌లో అప్లోడ్ చేస్తుంటారు. ఇలా అప్లోడ్ చేయడంతో ఫంటర్‌కు ఎప్పటికప్పుడు మ్యాచ్ బెట్టింగ్‌కు సంబంధించి అప్డేట్ వస్తుంటుంది.
ఈ ముఠా నిర్వహిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ ప్రతి రోజు కోట్ల రూపాయల్లో ఉంటుందని సీపీ వెల్లడించారు. నిర్వాహకుడైన ప్రధాన బుకీ విజయవాడకు చెందిన పాండు పరారీలో ఉండగా ఇతడికి దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వీళ్ల బెట్టింగ్ అడ్డాకు కాల్స్ వస్తుంటాయి. విశ్వసనీయ సమాచారంతో సోమవారం రాత్రి ఈ అడ్డాపై బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 60.39 లక్షల నగదు, బ్యాంకులో ఉన్న రూ.5,89,239 ఫ్రీజ్ చేశారు, వీటితో పాటు 19 సెల్ఫోన్లు, మూడు లైన్ బోర్డులు, 8 ల్యాప్టాప్స్, 3 టీవీలు, 30 కీప్యాడ్ ఫోన్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్, ఇతర సమాచారం పోలీసులకు ఇవ్వాలంటే 9490617444కు వాట్సాఫ్ ద్వారా పంపించాలని సీపీ సూచించారు.