చిక్కడపల్లి, మార్చి 8 : చెరుకు సుధాకర్ గౌడ్‌ను చంపుతానని బెదిరించిన ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్ గౌడ్ అన్నారు. బుధవారం చిక్కడపల్లిలోని కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాల్‌రాజ్‌గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టె విజయ్‌కుమార్ గౌడ్లతో కలిసి మాట్లాడారు. నల్గొండ జిల్లాలో బడుగు, బలహీన వర్గాలను రాజకీయాల్లో ప్రధాన నేతలుగా ఉండకుండా అడ్డుపడుతూ తమ ఆధిపత్యం కోసం ఈ లాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గౌడ సమాజం ఏకమైందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎక్కడి నుంచి బరిలో నిలబడినా చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చెరుకు సుధాకర్‌గౌడ్‌కు వెంటనే క్షమాపణ చెప్పి.. ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కమిటీ విజయ్‌కుమార్ గౌడ్, బి.వెంకటేశ్‌గౌడ్, పోతగానికి ఐలయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.