సిటీ బ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): లింగంపల్లి రైల్వే స్టేషన్లో రైళ్లలో దోపిడీకి పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి ఒక క్యారీ బ్యాగ్, ఒక లగేజీ బ్యాగ్, ఐదు సెల్ఫోన్లు, ఒక ఫ్యాషన్ ప్రో బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రంగారెడ్డి జిల్లా యాలాల మండలం జక్కంపల్లికి చెందిన వడ్డిచెర్ల రాజుగా గుర్తించారు. అతడు రైళ్లలో దారి దోపిడీకి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈనెల 22న తిరుపతి-నిజామాబాద్ రైలు, రాయలసీమ ఎక్స్ ప్రెస్‌లో వేర్వేరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.1.75 లక్షలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నిందితుడిపై బ్యాగులు, ఫోన్ల దొంగతనం నేరం కింద కేసు నమోదు చేశారు. గతంలో ఇతడిపై తాండూరు పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఆర్పీ బీ.ప్రవీణ్‌కుమార్, రైల్వే పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దొంగను పట్టుకుని అరెస్ట్ చేసినందుకు హైదరాబాద్ రైల్వేస్, రోడ్ సేఫ్టీ అధికారులు అభినందనలు తెలిపారు.