సిటీబ్యూరో, అక్టోబరు 9(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా ఔటర్ రింగు రోడ్డు మారింది. భారీ ప్రాజెక్టులు, కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఔటర్ రింగు రోడ్డు చుట్టూనే ఎక్కువగా వెలుస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఓఆర్ఆర్ను పరిగణనలోకి తీసుకొని తమ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) గ్రేటర్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రోత్ కారిడార్ నిబంధనలను పక్కాగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది.
అభివృద్ధి పేరుతో అడ్డగోలు అనుమతులు ఇవ్వడం, నిర్మాణాలు చేపడితే వాటిపై వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగానికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంట ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డు నుంచి 15 మీటర్లు (50 అడుగులు) బఫర్ జోన్ ఏరియా. ఇక్కడ ఎలాంటి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు జరపకూడదని హెచ్ఎండీఏ బఫర్ జోన్ పరిసరాల్లో ఉన్న భూములు యాజమానులకు ప్రత్యేకంగా సూచనలు చేసింది. ప్రభుత్వం నిబంధనల మేరకు బఫర్ జోన్లో కేవలం పచ్చదనం పెంపకానికి మాత్రమే అనుమతి ఉందన్న విషయాన్ని హెచ్ఎండీఏ ఆయా భూముల యజమానులకు గుర్తు చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్కు ఇరువైపులా వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్ చెరువుల చుట్టు పక్కల ప్రాంతాలను మినహాయిస్తే, మిగతా ప్రాంతాల్లో ఎలాంటి ప్రాజెక్టులను చేపట్టడానికైనా వందల ఎకరాల భూములు ఉన్నాయి. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చిన జో నింగ్ నిబంధనలను అనుసరించి ఆయా భూములను వినియోగించుకునే అవకాశం ఉంది.
వాటికి అనుగుణంగా చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు వందల ఎకరాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన భూముల ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నాయి. ఓఆర్ఆర్ను కోర్ సిటీ నుంచి అనుసంధానం చేస్తూ 33 రేడియల్ రోడ్డు, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, చుట్టూ ఉన్న ఇతర రాష్ర్టాలు, మెట్రో నగరాల నుంచి జాతీయ రహదారులు ఓఆర్ఆర్తో అనుసంధానమై ఉన్నాయి. మెరుగైన రోడ్డు రవాణా మార్గాలను పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకుంటూ ఓఆర్ఆర్ చుట్టూ కిలో మీటరు వరకు నిర్ణయించిన గ్రోత్ కారిడార్ నిబంధనలను పాటించాలని హెచ్ఎండీఏ అధికారులు భూ యజమానులకు, పెట్టుబడిదారులకు సూచిస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు నిర్వహణను హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు సుమారు రూ.250 కోట్లను వెచ్చిస్తోంది. 158 కిలోమీటర్ల ఉన్న ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లతో పాటు రైల్వే కారిడార్ కోసం సేకరించిన 25 మీటర్ల వెడల్పుతో ఉన్న స్థలం, 8 వరుసలతో ఉన్న ప్రధాన రహదారి మధ్యలో రకరకాల పూల మొక్కలు, చెట్లను పెంచుతూ పచ్చదనం పెంపొందిస్తున్నారు.
అదే విధంగా ఓఆర్ఆర్ ఎల్ఈడీ బల్బులతో విద్యుద్దీకరణ, మొక్కలకు, చెట్లకు నిరంతరం నీటి సరఫరా కోసం డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్కు ఇరువైపులా ఒక కిలోమీటరు మేర ఉన్న గ్రోత్ కారిడార్ పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ నిబంధనల మేరకే నిర్మాణాలు జరిగేలా నిరంతరం పర్యవేక్షణించే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
గ్రేటర్ పరిధిలోని ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సందర్భంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు 15 మీటర్ల సెట్‌బ్యాక్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు ఇవ్వాలని సూచించారు. వీటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీ.ఓ నం. 470, తేదీ 9-7-2008/జీ.ఓ.నం. 440 తేదీ 26.10.2013) ప్రకారం, ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు డెవలపర్స్, ప్రభుత్వం స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు) తప్పనిసరిగా పాటించాలని హెచ్ఎండీఏ అధికారులు సూచించారు.
అదే విధంగా నిర్ధేశించిన బఫర్ జోన్లో హోర్డింగ్స్, యూనిపోల్స్, టెలికాం టవర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిష్ యాంటినాలు కూడా ఉండటానికి వీలు లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎక్కడైనా బఫర్ జోన్ పరిధిలో కాంపౌండ్ వాల్స్ (ప్రహరీ గోడలు), బారి కేడింగ్ షీట్స్ వంటి వాటిని వెంటనే గుర్తించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, నిరంతరం, పర్యవేక్షణ ఉండాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ భూ యాజమానులు భవన నిర్మాణ సమయంలో బఫర్ జోన్‌ను గ్రీనరీ కింద ఓపెన్ స్పేస్‌గా చూపించి అనుమతులు పొందే అవకాశం ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.