పరిపాలనా సౌలభ్యం.. నగర సమగ్రాభివృద్ధి అంటూ.. సర్కారు గొప్పలకు పోయి జనాలను తిప్పలకు గురి చేస్తున్నది.. ఔటర్ వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా ప్రకటించిన సర్కారు.. 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలోకి విలీనం చేసి ‘హైదరాబాద్ మెగా సిటీ’గా మార్చేసింది. ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ.. ప్రభుత్వం రెండు రోజుల కిందట మూడు ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. ఈ పురపాలికలకు సంబంధించిన రికార్డులను జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో స్వాధీనం చేసుకునేందుకు డిప్యూటీ కమిషనర్లకు అప్పగించి.. (నేటితో) 5వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అంతేకాకుండా ఈ 27 యూఎల్బీలను విలీనం చేయడం ద్వారా అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన ముగిసింది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాలను జీహెచ్ఎంసీలోకి ఐదు జోన్లలో కలిపారు. అయితే విలీనం ప్రక్రియపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
సిటీబ్యూరో/బడంగ్‌పేట, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రజాభిప్రాయం లేకుండా పురపాలికలను ఇష్టమొచ్చినట్లు జోన్లలో కలిపి ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గురువారం పలు చోట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రదానంగా బడంగ్‌పేట మున్సిపాలిటీల్లో ప్రజలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ, అఖిల పక్ష నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజాపాలన అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమేనా? అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన బడంగ్‌పేటను చార్మినార్ జోన్లో కలిపారంటూ.. భగ్గుమన్నారు. బడంగ్‌పేటకు సంవత్సరానికి రూ.70 కోట్ల ఆదాయం వస్తుందని, ఇక్కడి ప్రజల ఆదాయాన్ని తీసుకుపోయి పాతబస్తీలో అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చార్మినార్ జోన్లో బడంగ్‌పేటను విలీనం చేయడం ద్వారా అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుక్కుగూడ, మీర్‌పేట, ఆదిబట్ల, తుర్క యంజాల్ తదితర మున్సిపాలిటీలను కలిపి బడంగ్‌పేట జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలను పరిగణంలోకి తీసుకొని ప్రభుత్వం మార్పు చేయాలన్నారు. లేదంటే కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక కార్పొరేషన్ అయ్యేవరకు ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. అఖిల పక్షం ఏర్పాటు చేసి ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.
పార్టీలకు అతీతంగా ఉద్యమాలకు సిద్ధం: బడంగ్‌పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎవరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చార్మినార్ జోన్లో విలీనం చేసిందని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆరోపించారు. గురువారం బడంగ్‌పేట పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడంగ్‌పేటను చార్మినార్ జోన్లో విలీనం నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజల అగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు.
ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలి: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు చార్మినార్ జోన్లో కల్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ అన్నారు. బాలాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అసౌకర్యంగా ఉన్న చార్మినార్ జోన్లో బడంగ్‌పేట కార్పొరేషన్‌ను విలీనం చేయడం అర్ధరహితమన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
బడంగ్‌పేటను ఎల్బీనగర్ జోన్లో కలపాలి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
పరిపాలనా సౌలభ్యం కోసం బడంగ్‌పేటను ఎల్బీనగర్ జోన్లో కలపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్‌కు చెప్పడంతో అందుకు ఆయన అంగీకరించినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థలను విలీన ప్రక్రియ సజావుగా జరగలేదన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణంలోకి తీసుకోలేదన్నారు. బడంగ్‌పేట ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయన్నారు. బడంగ్‌పేటను చార్మినార్ జోన్లో కల్పడం ద్వారా ఇక్కడి ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని కమిషనర్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. కొత్తగా పది జోన్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కమిషనర్ చెప్పారని, అందులో బడంగ్‌పేట ఉంటుందన్నారన్నారు.చార్మినార్ జోన్ నుంచి బడంగ్‌పేటను ఎల్బీనగర్కు మారుస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.