అంబర్‌పేట/ గోల్నాక, జనవరి 1: ఆదివారం అంబర్‌పేట డివిజన్ ఓవైసీనగర్‌లో స్థానిక అయ్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భిక్ష వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.
చేదు జ్ఞాపకాలతో 2022కి వీడ్కోలు పలికిన ప్రజలు భవిష్యత్‌పై ఆశావాహ దృక్పథంతో నూతన 2023 సంవత్సరానికి స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో గతంలో వేడుకలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ సంవత్సరం విందులు.. వినోదాలు.. ఆటలు.. పాటలు.. నడుమ చిన్నాపెద్ద అందరూ సంబురాలు జరుపుకొంటూ కొత్త ఆశలతో నూతన ఏడాదిలోకి అడుగులు వేశారు. కొత్త ఏడాదికి ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని దేవాలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. కొత్త సంవత్సరం తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని ప్రార్థనలు చేశారు.
నియోజకవర్గంలోని అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ తదితర ప్రాంతాలలో తెల్లవారు జామునే మహిళలు నిద్రలేచి ఇంటి ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రంగు రంగుల ముగ్గులను వేశారు. కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ కేక్‌లు కట్ చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డిని బ్రహ్మకుమారీస్ సభ్యులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆర్యవైశ్య సంఘం నల్లకుంట అధ్యక్షుడు లింగా ప్రకాశ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను స్థానిక సురభి గ్రాండ్లో ఆవిష్కరించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరి గజవాడ అంజన్‌కుమార్, కోశాధికారి పుప్పల శివకుమార్‌గుప్త, సభ్యులు ఎర్రం శ్రీనివాస్, జయరాం క్యాస, కర్నాటి పాండు, జైన శ్రీనివాస్, పాత చంద్రమౌళి, కూర కృష్ణమూర్తి, మహంకాళి రమేశ్, మాదరపు రమేశ్, మురికి అంజయ్య, పి. సుధాకర్, సనత్‌కుమార్, సంతోష్, రాంచందర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.