సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పాష్)పై రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, మహిళా భద్రత డైరెక్టర్ శిఖా గోయెల్, ప్రభుత్వ కార్యదర్శి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ కమిషనర్ వాకాటి కరుణ, హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ శేఖర్‌రెడ్డి, మహిళా భద్రత డీసీపీ దార కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్‌షాపునకు హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ.. హెచ్సీఎస్సీ కార్యాలయాలు, సంస్థలు, కమ్యూనిటీల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలపై వరుసగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ వేధింపుల నిరోధక చట్టం 2013 గూర్చి వివిధ సంస్థల అంతర్గత కమిటీ సభ్యులకు అవగాహన కల్పించడం ద్వారా చట్టంపై అవగాహన పెరగడం, దానిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. అన్ని సంస్థలలో అంతర్గత కమిటీల ఏర్పాటు తప్పనిసరి చేయడం వల్ల ఉద్యోగులకు, ప్రధానంగా మహిళలకు సురక్షితమైన వాతావారణం ఏర్పడుతుందని సూచించారు.