సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: నిమ్స్ వైద్యశాలలో రక్తపోటును పరీక్షించే అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.12 లక్షల విలువైన బీపీ టెల్లింగ్ మిషన్లను దవాఖానలోని సెక్యూరిటీ కార్యాలయం ప్రాంగణంలో ఒకటి, ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఈ ఆటోమేటిక్ బీపీ టెల్లింగ్ మిషన్ల కోసం ప్రత్యేకంగా గదులను నిర్మించారు.
ఈ యంత్రాల ద్వారా బీపీతో పాటు పల్స్ రేట్‌ను సైతం తెలుసుకోవచ్చు. ఈ మేరకు శనివారం వేం చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఐశ్వర్య రెడ్డి రెండు ఆటోమేటిక్ బీపీ యంత్రాలతో పాటు 10 ఎయిర్ కూలర్లు, 13 ట్రాలీలను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప చేతుల మీదుగా విరాళమిచ్చారు. అనంతరం ఆమె ఈ యంత్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ , అడిషనల్ సూపరిండెంట్స్ డా. వెంకట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.