సిటీబ్యూరో: నిత్యం వేలాది మంది రోగులతో రద్దీగా ఉండే నిమ్స్‌లో రోగులకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదులతో నేడు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. 2020లో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను, 2021లో న్యుమటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం వంటి అత్యాధునిక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిమ్స్ దవాఖాన అంచెలంచెలుగా ఎదుగుతూ.. వైద్యసేవలను అందిస్తున్నది. ఈ క్రమంలోనే నిమ్స్‌లో 6నెలల కిందట ఆటోమేటిక్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు.
ప్రతి రోజూ 10వేల వరకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేస్తారు. ఇందులో సుమారు 8వేల వరకు బయోకెమెస్ట్రీ, మైక్రోబయాలజీకి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రొటీన్, స్పెషల్ పరీక్షలు ఉంటాయి. ప్రతి రోజూ ఇన్ని వేల టెస్టులు చేసి, వాటి నివేదికలు ఇవ్వాలంటే రోజుల తరబడి నిరీక్షణ తప్పదు. దీనిని నివారించేందుకే ఆటోమెటిక్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ఏ పరీక్షలైనా దాదాపు 4 గంటల్లో పూర్తి చేసి రిపోర్ట్స్‌ను జారీ చేస్తాం. బ్యాచ్‌ల వారీగా టెస్టులు నిర్వహిస్తు న్నాం. 24 గంటల పాటు ఈ ఆటోమేటిక్ లాబ్స్ పనిచేస్తుంటాయి.
ఉదయం ఓపీకి వచ్చిన రోగులు వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు రా యించుకుంటే వారు అదేరోజు పరీక్షలు చేయించుకోవచ్చని బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ నూర్జహాన్ తెలిపారు. ‘దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగ దవాఖానల్లో ఈ ఆటోమేటిక్ ల్యాబ్స్‌ను నిమ్స్‌లో ఏర్పాటు చేశాం. ఆరు నెలల కిందట ప్రారంభించిన ఈ ల్యాబ్స్ ద్వారా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకేసారి 5వేల మెడికల్ రిపోర్ట్స్‌ను ఇవ్వగలుగుతున్నాం. బయోకెమిస్ట్రీ, పాథలాజీ, మైక్రోబయాలజీ విభాగాలకు సంబంధించిన అన్ని రకాల రక్త పరీక్షలను ఈ ఆటోమేటిక్ ల్యాబ్‌లలో నిర్వహిస్తుండడం వల్ల రోగులకు సత్వరమే మెడికల్ రిపోర్ట్స్‌ను అందించగలుగుతున్నాం.’ అని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు.