“నగరానికి చెందిన ఆటో డ్రైవర్ నిరంజన్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూలులో చదివిస్తున్నాడు. ఈ సారి ఉపాధి లేక ఇల్లు, ఈఎంఐ, నిత్యావసరాల ఖర్చులతో సతమతమైన అతడు తన బిడ్డను ప్రభుత్వ బడిలో చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. నాల్గో తరగతి వరకు ప్రైవేట్ స్కూలులో చదివిన ఆ విద్యార్థి ఇప్పుడు ప్రభుత్వ స్కూలులో చదువనంటూ మారాం చేస్తున్నాడని నిరంజన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.” నగరంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి నిరంజన్ లాగానే మారిందని మిగతా ఆటోవాలాలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.”
“ఆటో డ్రైవర్ రవికుమార్‌కు ఇద్దరు కూతుళ్లు. చిన్న బిడ్డని ఓ ప్రముఖ స్కూలులో చేర్పించాలని అనుకున్నాడు. అందుకు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ కూడా ముగిసింది. కానీ గత మూడు నెలల నుంచి ఆటో గిరాకీ లేక ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్కూల్ ఫీజు భరించగలమా? అని ఆందోళన చెందిన రవి కుమార్ ఆ అడ్మిషన్‌ను రద్దు చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు.”
సిటీబ్యూరో, జూన్ 11 ( నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్లపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి ఆటోవాలాల బతుకు ధీనస్థితిలోకి వెళ్లిపోయింది. మహిళలకు ఉచిత బస్సు స్కీం ప్రవేశపెట్టడంతో ఆటోల చక్రాలకు బంధనాలు పడ్డాయి. గిరాకీ లేక రోడ్డునపడ్డారు. ఓ వైపు ఇంటి కిరాయిలు..మరోవైపు నిత్యావసర ఖర్చులు మొన్నటి వరకు వారిని వెంటాడితే.. ఇప్పుడు ‘జూన్ 12’ బడులు ప్రారంభం అనే గుదిబండా వారిపై పడింది. ఉపాధి లేక ఇల్లు గడవడమే గండంగా మారిన వారికి తమ పిల్లల స్కూల్ ఫీజులు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. ఆటోవాలాల బిడ్డల విద్యా భవిష్యత్తునూ కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేస్తోందని ఆటో సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతకడం కోసం ఇప్పటికే నానాయాతన పడుతున్న ఆటో అన్నలు.. ఉపాధి లేక తల్లడిల్లుతున్నారు. బండి ఈఎంఐలు చెల్లించడమే గగనంగా మారింది. ఇప్పుడు తమ బిడ్డల స్కూల్ ఫీజులకు డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియక సతమతమవుతున్నారు. “ఈ ఏడాదికి ఫీజు తక్కువగా ఉన్న స్కూల్లో చేరండి, ప్రభుత్వ స్కూల్లో చదువుకోండి.. కోచింగ్, ప్రత్యేక ట్యూషన్లు వెళ్లాల్సినవసరం లేదు.. ఇంట్లోనే చదువుకోండి..” అంటూ పిల్లలకు సర్ది చెప్పుకుంటున్నారు.
మరోసారి వైరల్‌గా ఆటోవాలాల సూసైడ్ రిపోర్ట్..!
ఆటో డ్రైవర్ల సూసైడ్ రిపోర్ట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు స్కీంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని విమర్శించారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల వివరాలతో ‘ ఆటో డ్రైవర్ల సూసైడ్ రిపోర్ట్’ సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం స్కీం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 34 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోయారంటూ లిస్టును షేర్ చేస్తున్నారు. ఆ లిస్టుకు పేపర్ క్లిప్పింగ్స్, టీవీ చానళ్ల వీడియోలు జత చేస్తూ ఆధారాలతో షేర్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారి చావులపై హేళనగా మాట్లాడుతోందని నెటిజన్లు ఫేస్బుక్, ఎక్స్‌లో కామెంట్స్ పెడుతున్నారు. మృతులు సారయ్య, సతీశ్‌గౌడ్, సత్యనారాయణ, అనిల్, హమీద్, అక్బర్, రాహుల్, నగేశ్, అరుణ్‌కుమార్, రవి, రామలింగయ్య తదితరుల ఫొటోలతో షేర్ చేస్తూ వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
మంత్రి పొన్నం సమీక్షలు గాలికేనా..!
ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ చెప్పిన మాటలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కనీసం ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రతీ ఏడాది ఆటో డ్రైవర్‌కు రూ.12వేలు అనే హామీని కూడా అమలు చేయలేదు. హైదరాబాద్‌లో 1.20 మంది ఆటోడ్రైవర్లు ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇప్పటికీ మూడు సార్లు ఆటో డ్రైవర్లతో చర్చలు జరిగాయి. కానీ ఏ ఒక్క చర్చలో కూడా సమస్యలకు సరైన పరిష్కారం చూపలేదు. ఆటోలకు గిరాకీ లేదని.. తమకు న్యాయం చేయండి అంటూ నెత్తినోరు మొత్తుకున్నా స్పందించలేదు. రోడ్డెక్కి ధర్నాలు చేసిన ఫలితం లేదని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు స్కూల్స్ ప్రారంభం అవుతుండటంతో పిల్లల విద్య దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రిగారు స్పందించండి..
స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఆటో డ్రైవర్లకు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎలా చెల్లించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి టీఏటీయూ తరపున తీసుకెళ్లాం. మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు..కానీ ఆటో డ్రైవర్లకు ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. పిల్లల విద్యా భవిష్యత్తు కోసం సాయం అందించాలని కోరుతున్నాం.
– వేముల మారయ్య, టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు