సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : పెట్రోల్, డీజిల్ ఆటోలకు రెటిరోఫిట్మెంట్ను ప్రభుత్వమే ఉచితంగా చేయించాలని టీఏటీయూ అధ్యక్షుడు వేముల మారయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆటోలకు గిరాకీ లేక డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏడాదికి ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 12వేలు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వం ఇటీవల 25వేల ఆటోలకు రెటిరోఫిట్మెంట్కు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఒక్కో ఆటోను రెటిరోఫిట్మెంట్ చేయిస్తే సుమారు రూ. 50వేల వరకు ఖర్చు వస్తుందన్నారు. గిరాకీ లేక కష్టకాలంలో ఉన్న ఆటో డ్రైవర్లు రూ. 50వేలు ఎక్కడి నుంచి తెస్తారని.. ఇప్పటికే వారి ఆటోల ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి కిరాయిలు చెల్లించలేక సతమతమవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. కొత్త ఆటోలకు అనుమతి ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ గిరాకీ లేక ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను సైతం పరిష్కరించాలని కోరారు. షోరూంలు ఆటోలను అధిక ధరకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీఎన్జీ వాహనాలకు ఫిల్లింగ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ ఆటోలకు తగినన్ని చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.