Crime News | మారేడ్పల్లి, జూలై 21: కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన పదకొండు నెలల కుమార్తెతో పాటు భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన గణేశ్ (35), స్వప్న (30) దంపతులు. వీరికి ముగ్గురు సంతానం.
వీరు త్రివేణి, తనుశ్రీ, నక్షత్ర (11 నెలలు) ఉన్నారు. జీవనోపాధి కోసం మహారాష్ట్ర నుంచి మూడేండ్ల కిందట వచ్చి ఈ కుటుంబం న్యూబోయిన్పల్లిలోని పెద్ద తోకట్ట ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. గణేశ్ కూరగాయల ఆటో నడుపుతున్నాడు. కొంత కాలంగా భార్య స్వప్నపై గణేశ్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది.
గణేశ్, అతడి భార్య, ముగ్గురు కుమార్తెలు శనివారం రాత్రి నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున గణేశ్ తన భార్య స్వప్న, 11 నెలల కుమార్తె నక్షత్రను తాడుతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం డయల్ 100కు కాల్ చేశాడు. ‘నేను.. నా భార్య, కుమార్తెను హత్య చేశాను.. నేను కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నాను’.. అని ఆదివారం ఉదయం సమాచారమిచ్చాడు. వెంటనే అప్రమత్తమైన బోయిన్పల్లి పోలీసులు, ఏసీపీ గోపాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఉదయం ఇంటి లోనికి వెళ్లి చూడగా.. స్వప్న, చిన్నారి నక్షత్ర మృతి చెంది ఉన్నారు. పెద్ద కుమార్తె త్రివేణి నిద్రలేచి కూర్చొని ఉండగా.. రెండో కుమార్తె అప్పుడే నిద్రలోంచి మేల్కొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. చిన్నారుల దీన స్థితిని చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. క్షణికావేశంలో భార్య, భర్త, కుమార్తె మృతి చెందడంతో ఇద్దరు ఆడ పిల్లలు అనాథలయ్యారు. బోయిన్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య స్వప్న, కుమార్తె నక్షత్రను హత్య చేసిన అనంతరం ఉదయం 6 గంటల సమయంలో గణేశ్ సుచిత్ర సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నక్షత్ర తనకు పుట్టలేదంటూ భార్యపై అనుమానం పెంచుకున్న గణేశ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.