సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధి దక్షిణ డిస్కంలో నకిలీ దందాపైనే చర్చ జరుగుతుంది. నకిలీ ఓసీలు, ఫేక్ కోర్టు ఆర్డర్లు, ఫోర్జరీ సంతకాలు.. ఇవి ఇప్పుడు దక్షిణ డిస్కంకు పెద్ద తలనొప్పిగా మారాయి. మారిన నిబంధనలకు అనుగుణంగా కనెక్షన్లు పొందాలంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలి లేదా కోర్టు ఆర్డర్ అవసరం.. ఈ నేపథ్యంలో కొందరు కాంట్రాక్టర్లు నకిలీ దందాకు దిగారు. ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి డిస్కంను బురిడీ కొట్టించారు. ఇందులో కొందరు ఇంజినీర్ల హస్తం ఉండడంతో ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా జరిగింది.
సీఈఐజీ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డర్లు తయారుచేశారంటూ 21న ‘నమస్తే’ తెలంగాణలో ఫోర్జరీతో విద్యుత్ కనెక్షన్లు అనే వార్త ప్రచురితమైంది. ఈ తర్వాత డిస్కంలో ఈ దందాపై విచారణ మొదలైంది. సరూర్‌నగర్‌లో ఓ కాంట్రాక్టర్ డిప్యూటీ సీఈఐజీ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన విధానంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అసలు ఈ నకిలీల కథేంటనే కోణంలో ఆరా తీశారు. గత సంవత్సర కాలంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇచ్చిన కనెక్షన్లు వాటి వివరాలతో పాటు గతంలో కొన్నింటిపై వచ్చిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే మొదట ఒక కాంట్రాక్టర్‌ను విజిలెన్స్ అధికారులు సుమారు మూడుగంటల పాటు విచారించారు. ఆ విచారణలో వెలుగుచూసిన వాస్తవాలను ఆధారంగా చేసుకుని సర్టిఫికెట్ల మాయాజాలంపై దృష్టిపెట్టారు. అంతా అన్లైన్లోనే జరుగుతుండగా అసలు తేడా ఎక్కడుంది అంటూ ఆరా తీశారు. ఈ క్రమంలోనే కొందరు ఇంటి దొంగల బాగోతం బయటపడింది. నకిలీలతో కనెక్షన్లు తీసుకోవడానికి కొందరు ఇంజినీర్లు సహకరించినట్లుగా విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది. ఇదొక్కటే కాదు.. మెటీరియల్ విషయంలోనూ నకిలీ బిల్లులు పెట్టి దోపిడీ చేసినట్లు తెలిసింది.
కాంట్రాక్టర్లపై నిషేధం.. అధికారులపై సస్పెన్షన్..!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 80శాతం భవనాలు నిబంధనలకు విరుద్దంగానే నిర్మిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన బల్దియా అధికారులు నిర్మాణదారులతో కుమ్ముక్కై ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండానే అనుమతుల విషయంలో చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఓసీ లేకుండా కనెక్షన్ ఇవ్వలేమని టీజీఎస్పీడీసీఎల్ గతంలోనే చెప్పినప్పటికీ ఇప్పుడు ఈ నిబంధనను కఠినతరం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓసీ లేకుండా కనెక్షన్ ఇచ్చే సమస్యే లేదని తేల్చి చెప్పడంతో కాంట్రాక్టర్లు కొందరు నకిలీల బాట పట్టారు. నకిలీ ఓసీలు, నకిలీ కోర్టు ఆర్డర్లు, సీఈఐజీకి సంబంధించిన ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్నారు.
మొత్తం ఎస్పీడీసీఎల్ పరిధిలో సుమారుగా నాలుగు వేలకు పైగా నకిలీలు ఉన్నట్లుగా తేలిందని, వీటిలో ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించడానికి బల్దియా, సీఈఐజీ అధికారుల సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం. బల్దియా నుంచి ఇచ్చిన ఓసీల లిస్ట్, తమ దగ్గర కనెక్షన్లు మంజూరైన లిస్ట్‌తో బేరీజు వేసుకోవడమే కాకుండా సీఈఐజీ అప్రూవల్స్కూడా చూసి ఆ తర్వాత నకిలీలని తేల్చినట్లు తెలిసింది. వీటన్నింటికి బాధ్యుల వ్యవహారం చూసి విజిలెన్స్‌తో పాటు డిస్కం ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ తతంగమంతా ఆన్లైన్లో జరగాల్సి ఉండగా వాటికి అప్రూవల్స్ ఇవ్వాల్సిన కొందరు ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై డబ్బులకు ఆశపడి కనెక్షన్లు ఇచ్చారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల వివరాలు బయటపడడంతో వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. మొదట పదిహేను మంది కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు వారిపై మొత్తం విద్యుత్‌శాఖలో ఎక్కడా పనులు చేయకుండా నిషేధం విధించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో కొందరు బడా కాంట్రాక్టర్లు కూడా ఉండడం, వారిని విచారించే క్రమంలో అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయని ఒక సీనియర్ విద్యుత్ అధికారి తెలిపారు. మరోవైపు నకిలీలకు సహకరించిన 56 మంది అధికారులకు మెమోలు ఇచ్చి వారిని వివరణ కోరారు.
అందులో 40మంది నకిలీ పత్రాలను వెరిఫై చేసినట్లుగా నిర్ధారించినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేయబోతున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో తమపై తూతూమంత్రంగా చర్యలు తీసుకునేలా చూడాలని ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు, కొందరు ఇంజినీర్లు సంబంధిత మంత్రిని, ముఖ్య అధికారిని కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తమపై వినియోగదారుల ఒత్తిడి మూలంగానే ఇలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా డిస్కం ఉన్నతాధికారులు ఏమాత్రం తగ్గడం లేదు.
మరొక్కసారి వీరికి అవకాశం ఇస్తే డిస్కం మొత్తం నకిలీలు, ఫోర్జరీలకు నిలయంగా మారుతుందని ఎస్పీడీసీఎల్ సీజీఎం స్థాయి అధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ ఒకవైపు ఓసీలతో పాటు మెటీరియల్ విషయంలోనూ చేసిన అవకతవకలపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. అంతేకాకుండా అధికారులను ఏసీబీకి పట్టిస్తానంటూ బెదిరించి పనులు చేసుకున్నవారిని కూడా వదిలేది లేదని సీఎండీ తన దగ్గరి అధికారులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఏదైనా నిబంధనల ప్రకారం చేసుకోవాల్సి ఉండగా తప్పు చేయడమే కాకుండా అధికారులను బెదిరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నట్లు డిస్కంలో చర్చ జరుగుతోంది.