బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని కంగారూ స్కూల్ ఎదురుగా డా. సి. నారాయణరెడ్డి సారస్వత సదనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక విభాగం సంచాకులు మామిడి హరికృష్ణ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
షేక్‌పేట మండలం సర్వే నెం 403లోని టీఎస్ నెం 4/ 1/ 1/ ,బ్లాక్-డి, వార్డు 10లో సుమారు 3050 గజాల ప్రభుత్వ స్థలంలో డా.సినారే సారస్వత సదనం భవనం నిర్మించేందుకు 2020 జూలై 29న మంత్రులు కేటీఆర్, శ్రీనివాసగౌడ్ చేతులమీదుగా శంకుస్థాపన జరిగిందన్నారు.
శనివారం ఈ స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం తమ శాఖకు అప్పటించిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించిన ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు. న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర తెలిపారు.