MGIT | మణికొండ, జూలై 7: హైదరాబాద్ గండిపేటలోని మహత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ)కి ATAL FDP (ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) మంజూరు చేయబడిందని కళాశాల ప్రిన్సిపల్ జి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. “క్వాంటం కంప్యూటింగ్ ఫౌండేషన్స్ అండ్ అప్లికేషన్స్” అనే అంశంపై ఈ ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్ సోమవారం నుంచి ఈ నెల 12 వరకు ఒక వారం పాటు నిర్వహించ తలపెట్టినామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మంది పాల్గొనడానికి మాత్రమే అర్హత ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని 25 విభిన్న కళాశాలల నుండి మొత్తం 99 మంది నమోదు చేసుకున్నారన్నారు.
AICTE (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఈ ATAL FDP కార్యక్రమాన్ని ఎంజీఐటీకి మంజూరు చేసిందని.. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని “క్వాంటం కంప్యూటింగ్ సంవత్సరం”గా ప్రకటించిందని అన్నారు. భారత ప్రభుత్వం కూడా 2025ను “క్వాంటం కంప్యూటింగ్ సంవత్సరం”గా ప్రకటించిన విషయం తెలిసిందే.
క్వాంటం కంప్యూటింగ్: ఫౌండేషన్స్ అండ్ అప్లికేషన్స్” పై ATAL FDP ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అర్హులంతా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జేఎన్టీయూహెచ్ – డి ఏ పి డైరెక్టర్ డా. వి. కామక్షిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్వాంటం కంప్యూటింగ్ ప్రాముఖ్యత, ప్రస్తుత కాలానికి అవసరమైన దాని అనువర్తనాల గురించి వివరించారు. ఎంజీఐటీ ప్రిన్సిపాల్ ప్రొ. జి. చంద్రమోహన్ రెడ్డి ఈ FDPకి హాజరవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ, కొన్ని అనువర్తనాలను కూడా ప్రస్తావించారు.
ఎంజీఐటీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొ. కె. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నాసా ఇతర పరిశోధనా సంస్థలు క్వాంటం కంప్యూటింగ్ ల్యాబ్‌లలో ఎలా పెట్టుబడులు పెడుతున్నాయో వివరించారు. ఎఫ్ డి పి కోఆర్డినేటర్ ప్రొ. టి.వి. రజినీకాంత్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం పరిశోధన నిధులు, ఎఫ్ డి పి నిధులు మంజూరు చేయడంలో ఎలా కృషి చేస్తుందో తెలిపారు. అనేక క్వాంటం కంప్యూటింగ్ కంపెనీలు, IIITలు మొదలైన వాటి నుండి, నిపుణుల నుంచి క్వాంటం కంప్యూటింగ్‌లో ఆచరణాత్మక జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పాల్గొనేవారికి సూచించారు.