ఖైరతాబాద్, డిసెంబర్ 19 : రాష్ట్రంలో సినీ, సెలబ్రిటీలు ఉపయోగిస్తున్న బౌన్సర్ల వ్యవస్థ మాఫియాలా మారిందని అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆరోపించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ముఖ్య సలహాదారులు, రిటైర్డ్ డీజీపీ నోయల్ స్వర్ణజిత్ సేన్, చైర్మన్ సి. భాస్కర్ రెడ్డి, అధ్యక్షుడు కెప్టెన్ బుద్ధ ఏర్లు మాట్లాడుతూ తమ సంఘం చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉందని, ఇందులో 45వేల సెక్యూరిటీ ఏజెన్సీలు లైనెన్సులు కలిగి ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనూ వెయ్యికిపైగా సంస్థలు ఉన్నాయన్నారు. అయితే బౌన్సర్ల వ్యవస్థ అనేది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల పరిధిలోకి రావని, వాటికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
అది చట్టబద్ధత లేని అక్రమ వ్యవస్థ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా లైసెన్సులేని సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయని, అర్హత కలిగిన ఏజెన్సీలన్నీ తప్పనిసరిగా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్మిక చట్టాల ప్రకారం చాలా మందికి వేతనాలు అందడం లేదని, అందుకు పాలక ప్రభుత్వాలే కారణమన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాలో వేతన సవరణ జరిగిందని, కానీ తెలంగాణలో జరుగలేదని, ఫలితంగా భద్రతలేని వేతనాలతో ఇక్కడి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రాష్ట్రంలోనూ కార్మిక శాఖ వేతన సవరణ చేస్తూ జీవో విడుదల చేయాలని, నిర్ణీత పనివేళలను అమలు చేస్తూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తూ వేతనాలు పెంచాలన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22న జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వెల్ఫేర్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ప్రధానకార్యదర్శి సతీశ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్.రవీందర్, వెంకటనర్సింహా రావు, కోశాధికారి అమర్దీప్ సింగ్, సహాయ కార్యదర్శులు రవిశంకర్, రాధికా ఎం. నాథ్ తదితరులు పాల్గొన్నారు.