సిటీబ్యూరో, చాంద్రాయణగుట్ట,చార్మినార్ జూలై 20(నమస్తే తెలంగాణ): ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు భాగ్యనగరి బోనమెత్తింది.. వాడవాడలా మహిళలు కొనసాగించిన ఆచారాలతో హైదరాబాద్ కోలాహలంగా మారింది.. బోనాలతో ఊరేగింపుగా సంప్రదాయబద్ధంగా తరలివచ్చిన భక్తులతో ఆలయాల్లో సందడి నెలకొంది..ఎటుచూసినా వేపాకు తోరణాలు, డప్పుచప్పుళ్లు, అమ్మవార్ల పాటలు, భజనలతో రాజధాని నగరం హోరెత్తింది.. గల్లీ నుంచి గోల్కొండ దాకా.. బస్తీల నుంచి లాల్‌దర్వాజ దాకా.. అడుగడుగునా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పోతరాజుల విన్యాసాలు, తొట్టెలు, ఫలహారం బండ్ల ఊరేగింపులు, విద్యుద్దీపాల అలంకరణలో ఆహ్లాదకర పోటీ కనిపించింది.
నగరంలోని ప్రధానమైన 29 దేవాలయాల వద్ద బోనాల ఉత్సవాలు ఆడంబరంగా జరిగాయి. ఇవే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 360 ఆలయాల వద్ద ప్రజలు బోనాల జాతర వైభవంగా జరుపుకొన్నారు. తొట్టెలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో ఎటు చూసినా సందడే కనిపించింది. కొన్నిచోట్ల ఫలహారం బండ్లు సోమవారం తీస్తుండడంతో వాటిని అలంకరించడానికి ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు.
ఆదివారం లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారితో పాటు చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి, హరిబౌలి శ్రీ అక్కన్నమాదన్న, మేకలబండ శ్రీ నల్లపోచమ్మ, ఉప్పుగూడ శ్రీ మహంకాళి, బేలా ముత్యాలమ్మ, సుల్తాన్షాహి శ్రీజగదాంబ, మీరాలమండి శ్రీ మహాకాళేశ్వరీ, బేలా బంగారు మైసమ్మ, అలియాబాద్ దర్బార్ మైసమ్మ అమ్మవార్లను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలను భక్తులు సాంప్రదాయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జంటనగరాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎ బట్టి విక్రమార్క అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు బలిహరణ, అనంతరం మాజీ ఎంపీ దేవేందర్‌గౌడ్ కుటుంబసభ్యుల చేతులమీదుగా మహాభిషేకం జరిగింది. తర్వాత బోనాల సమర్పణ కార్యక్రమం మొదలైంది.
బోనాల సందర్భంగా మహిళలు కొత్త మట్టి కుండకు పసుపు, కుంకుమ, వేప ఆకులతో అందంగా అలంకరణ చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యం కుండలో పెట్టి కుండ పైన వెలిగించిన దీపంతో సాంప్రదాయ దుస్తులతో దేవాలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద బోనం సమర్పించే వారి కోసం ప్రత్యేకంగా క్యూ ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారికి, సామాన్య భక్తులకు మరో రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
ప్రముఖులను ఆలయ ప్రధాన మార్గంలో లోపలికి అనుమతి ఇచ్చి అమ్మవారి దర్శనం కల్పించారు. నెత్తిన బోనంతో జోగినిలు,శివసత్తులు పునకాలతో తరలివచ్చారు. వీరి ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోతరాజుల విన్యాసాలు చూపరులను అబ్బురపర్చాయి. బోనాల జాతర సందర్భంగా నగరంలోని పలుచోట్ల అమ్మవార్లకు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టువస్ర్తాలు సమర్పించారు. సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం నిర్వహించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కవిత కోరుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మేరు యశ్వంత్ కుమార్ కుమారుడు, లగ్గం సినిమా హీరో రాజేశ్‌ను ఎమ్మెల్సీ కవిత శాలువా కప్పి సన్మానించారు. కుటుంబ నేపథ్యంలో యువతను ఆకట్టుకునే విధంగా సినిమాను తీస్తున్నారని ప్రశంసించారు.
బోనాల పండుగ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, కొండా సురేఖ,జూపల్లి కృష్ణారావు, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రి డి.కె. అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాకేశ్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
సినీహీరో మంచుమనోజ్, సింగర్స్ మధుప్రియ, మంగ్లీ, దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, తనికెళ్లభరణి తదితర సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బి. మారుతి యాదవ్, కన్వీనర్ జి.అరవింద్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు పోసాని సతీశ్ ముదిరాజ్, అమర్నాథ్ యాదవ్, మాజీ చైర్మన్లు కె.వెంకటేశ్, కె.విష్ణుగౌడ్, కాశీనాథ్‌గౌడ్, మాణిక్ ప్రభుగౌడ్, బంగ్లా రాజుయాదవ్, సి. వెంకటేశ్, బి.బల్వంత్ యాదవ్, ఆలయ ప్రతినిధులు ఏ. చంద్రకుమార్, ఏ. వినోద్‌కుమార్, శేషునారాయణ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించడంతో పాటు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.
లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయంలో సోమవారం ఉదయం రంగం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉప్పుగూడ , మీరాలమండి, గౌలిపురా, లాల్‌దర్వాజలో రంగం ఉంటుందన్నారు. మధ్యాహ్నం తొట్టెల, ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ఊరేగింపు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయా ఆలయాల నిర్వాహకులు తెలిపారు. అక్కన్న మాదన్న దేవాలయం వద్ద అమ్మవారి ఘటాన్ని అంబారీపై ప్రతిష్టించి ఊరేగింపు జరుగుతుంది. ఈ సందర్భంగా 22 దేవాలయాల ఘటాలు, తొట్టెలు ఊరేగింపుగా వచ్చి నయాపూల్ వద్ద ముచుకుందానదిలో నిమజ్జనం చేస్తారని భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్ తెలిపారు.