చిక్కడపల్లి, డిసెంబర్ 31: ఆశల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంలేదని, పారితోషికం లేని అనేక పనులు ఆశలతో ప్రభుత్వ చేయిస్తుందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశలకు రూ.18వేల వేతనం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆశాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 17రోజుల పాటు ఆశ నాయకత్వంలో బస్సు యాత్ర నిర్వహించారు. మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ముగింపు సభను నిర్వహించారు. ఈ సభకు వేలాది ఆశ వర్కర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం స్కీంలో భాగంగా గత 19 ఏండ్లుగా రాష్ట్రంలో ఆశ వర్కర్లు పని చేస్తున్నారని, వీరంతా బడుగు, బలహీన వర్గాల చెందిన వారన్నారు. నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని, కానీ ప్రభుత్వం ఆశలకు చెల్లించేది, పనిని బట్టి పారితోషికం మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పనిలో ఉండాలని, లేకపోతే పారితోషికాలు తగ్గించి రాస్తామని ఆశాలను అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. డెలివరీల సందర్భంగానైతే 2, 3 రోజులు కుటుంబాన్ని వదలి దవాఖానల వద్ద ఆశలు పడిగాపుల కాస్తున్నారని తెలిపారు. ఇంత చాకిరీ చేస్తున్నా ఆశల సమస్యలు పట్టించుకోవడంలేదని మండిపడ్దారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆశలకిచ్చిన హామీలు, ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాల ద్వారానే 18వేల ఫిక్స్డ్ వేతనం సాధించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 2014లో కేంద్రమంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏండ్లు దాటినా 45వ ఐఎల్సీ సిఫారసులు మాత్రం అమలు చేయడంలేదన్నారు. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షురాలు ఎస్.రమ, సునీత, నాయకుడు భూపాల్, జే.వెంకటేశ్, ఈశ్వర్రావు, ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు పి.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నీలాదేవి, కోశాధికారి గంగమణి, కాసు మాధవి తదితరులు పాల్గొన్నారు.