సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఒకటైన హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ 5వ సారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3.3 లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అంతకు ముందు 2019లో, 2014, 2009, 2004లో జరిగిన ఎన్నికల్లోనూ వరుసగా ఆయనే హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు 1994-1999, 1999-2004 వరకు చార్మినార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.