చార్మినార్, అక్టోబర్ 3: నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్తుడిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకున్నది. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియా లాగస్ నగరానికి చెందిన డానియల్ (33) ఉన్నత విద్య అభ్యసించేందుకు 2014లో నగరానికి వచ్చాడు. విద్యను పూర్తి చేసుకున్న అతడు.. డ్రీమ్ వ్యాలీ ఫ్రెండ్స్ కాలనీలో నివసిస్తున్నాడు. విద్యాభ్యాసం కొనసాగిస్తున్న సమయంలోనే మత్తుమందుకు బానిసయ్యాడు. నిషేధిత ఉత్ప్రేరకాలను వినియోగిస్తున్న డానియల్‌కు ఢిల్లీలో నివసించే మరో నైజీరియన్ జాన్‌పాల్‌తో పరిచయం ఏర్పడింది.
అప్పటికే జాన్‌పాల్ మత్తు మందు అమ్మకాలు కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి నగరంతోపాటు సైబరాబాద్ ప్రాంతాల్లో కొకైన్ వినియోగిస్తున్న వారి వివరాలు సేకరించి మత్తు మందు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో డానియల్ జాన్‌పాల్ నుంచి కొకైన్‌ను నగరానికి దిగుమతి చేయించుకున్నాడు. ఆదివారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీవీకే మాల్ వద్దకు చేరుకున్న డానియల్ కొకైన్ విక్రయించేందుకు సిద్ధంగా ఉండగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పంజాగుట్ట పోలీసుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. 4 గ్రాముల కొకైన్‌ను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించామని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపారు. మరో ప్రధాన నిందితుడు జాన్‌పాల్ పరారీలో ఉన్నారని వెల్లడించారు.