బంజారాహిల్స్, అక్టోబర్ 2: వెల్నెస్ సెంటర్లో మసాజ్ చేయించుకునేందుకు వచ్చిన మహిళ ఆభరణాలు కాజేసిన యువతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫీజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నం.10లో నివాసముంటున్న అఖిల(20) అనే యువతి రోడ్ నం. 12లోని మేగావి వెల్నెస్ స్పాలో హౌస్‌కీపింగ్ ఉద్యోగం చేస్తున్నది. ఆగస్టు 24న ఎమ్మెల్యే కాలనీకి చెందిన ఓ మహిళ మసాజ్ చేయించుకునేందుకు ఈ సెంటర్‌కు వెళ్లింది. మసాజ్ చేసుకునే సమయంలో ఆమె మెడలో ఉన్న ఐదున్నర తులాల బంగారు నెక్లెస్, నల్లపూసలు వజ్రాలతో ఉన్న 3 తులాల గొలుసు తీసి పక్కన పెట్టింది. సుమారు 3 గంటల తర్వాత ఆభరణాల విషయం మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. గమనించిన అఖిల ఆ ఆభరణాలను తస్కరించింది. మూడురోజుల తర్వాత బాధితురాలికి ఆభరణాల విషయం గుర్తుకురావడంతో అక్కడకు వచ్చి వాకబు చేసింది.
అయితే సంస్థలో పనిచేస్తున్న వారితో పాటు నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గత నెల 26న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, చోరీకి పాల్పడింది అఖిల అని తేలింది. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా, చోరీ సొత్తును చింతల్‌బస్తీలో నివాసముంటున్న అమీర్ అలీ అనే వ్యాపారికి విక్రయించినట్లు తేలడంతో వాటిని స్వాధీనం చేసుకొని నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.