బంజారాహిల్స్,ఆగస్టు 16: తనను పెండ్లి చేసుకోకుంటే అంతు చూస్తానంటూ పదో తరగతి చదువుతున్న బాలికను బెదిరింపులకు గురి చేస్తున్న యువకుడు, అతడి స్నేహితులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని గౌరీశంకర్ కాలనీలో ఉంటున్న బాలిక(15) పదో తరగతి చదువుతున్నది. ఏడాది కిందట ఇబ్రహీంనగర్‌లో అద్దెకున్న సమయంలో జీవన్‌కుమార్ (21) అనే యువకుడు ప్రేమ పేరుతో అమె వెంటపడి వేధించేవాడు. ఆమె విషయాన్ని తల్లికి చెప్పడంతో అక్కడి నుంచి ఖాళీ చేశారు. కాగా, అప్పటినుంచి బాలిక అడ్రస్కోసం వెతుకుతున్న జీవన్‌కుమార్ ఈనెల 14న తన స్నేహితులు సోహెబ్, సునీల్‌కుమార్‌తో కలిసి బాధితురాలి ఇంట్లోకి వచ్చాడు. తనను వివాహం చేసుకోకుంటే అంతు చూస్తానంటూ బాలికతో పాటు అమె తల్లిని కూడా బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధిత కుటుంబం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు జీవన్‌కుమార్‌తో పాటు అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.