బంజారాహిల్స్ : అర్థరాత్రి వేళ బైక్‌లో కత్తి పెట్టుకుని అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 7లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత అనుమానాస్పద వాహనాలను తనిఖీలు చేస్తున్న జూబ్లీహిల్స్ ఎస్ఐ కృష్ణవేణి ఆధ్వర్యంలో పోలీసులు ఓ హోండా యాక్టివాను అపేందుకు ప్రయత్నించారు.
అయితే వాహనం నడిపిస్తున్న యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డగించి సోదాలు చేశారు. బైక్ డిక్కీలో కత్తిని గుర్తించారు. ఈ విషయంపై ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. హిజ్రాలను కలిసేందుకు వచ్చి వారిని బెదిరించేందుకు కత్తిని తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
దీంతో బేగంపేట రసూల్‌పుర సమీపంలోని గన్ బజార్‌కు చెందిన మహ్మద్ సల్మాన్(18), చిలకలగూడకు చెందిన ఇమామ్ (17)లపై ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు.