సిటీబ్యూరో, మే 29(నమస్తే తెలంగాణ) : నగరంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం టీజీఐసీసీసీలో జరిగిన విలేకరుల సమావేశంలో అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్యకేసు, దర్యాప్తు సంబంధించిన వివరాలను సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ముజాహిద్ ఆలంఖాన్, ఆయన తండ్రి మహబూబ్ ఆలంఖాన్, కిషన్ అలియాస్ పప్పు, అభిజిత్ అలియాస్ నాని, దిఘన్ వినయ్, విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటు, మణిదీప్ అలియాస్ పోగోనానిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు, వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి 10.10లక్షల నగదు, ఒక స్కార్పియో వాహనం, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీపీ చెప్పారు.
ప్రమాదంలా కనిపించిన మొయిజుద్దీన్ హత్య ఘటన వెనకు పక్కా కుట్ర ఉన్నదని, తమ దర్యాప్తులో మొయిజుద్దీన్ హత్యకు సంబంధించి పలు విషయాలు బయటకు వచ్చాయని సీపీ చెప్పారు. వక్ఫ్ ఆస్తులు, ట్రిబ్యునల్ కేసుల వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణంగా విచారణలో వెల్లడైందని, ప్రధాన కుట్రదారుడైన ముజాహిద్ ఆలంఖాన్‌ను అరెస్ట్ చేశామన్నారు. కాంగ్రెస్ నేతలు ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్‌లకు మొయిజుద్దీన్‌కు మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయన్నారు.
హైదరాబాలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాతమాసబ్ట్యాంక్ శాంతినగర్ ప్రాంతంలో ఈనెల 23న తెల్లవారుజామున మొయిజుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి హత్య చేశారని, పక్కాస్కెచ్‌తో ఈ హత్య చేసినట్లు సీపీ చెప్పారు. మొయిజుద్దీన్ తన ఇంటినుంచి తెల్లవారుజామున 5.45గంటలకు స్విమ్మింగ్ వెళ్తుండగా నెంబర్ ప్లేటులేని వాహనంలో వచ్చి ఢీకొట్టడంతో ఆయన పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారని సీపీ చెప్పారు. ప్రధాన నిందితులైన కాంగ్రెస్ నేతలు ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్లు తమ సన్నిహితులైన హసన్ అలీ అలియాస్ ఛావూస్, మునీర్‌లతో కలిసి కిషన్ అలియాస్ పప్పు ద్వారా ఈ హత్యకు కుట్ర పన్నారు. మునీర్, చైస్ తమ పథకం అమలుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయమని కిషన్‌కు నగదు ఇచ్చారు. కిషన్ ఈ పథకాన్ని అమలు చేయడానికి వినయ్‌ను నియమించుకోగా వినయ్ విక్రమ్ అలియాస్ చింటు ద్వారా అభిజిత్ అలియాస్ నానితో కలిసి రెక్కీ చేశారు.
మొయిజుద్దీన్ తరచూ తిరిగే ప్రదేశాలు, నేరాన్ని అమలు చేయడానికి కావలసిన ప్రదేశం, సమయం గుర్తించడానికి మొయిజుద్దీన్ కదలికలపై నిఘా పెట్టారు. అనంతరం తమ కుట్రను అమలు చేయడంలో భాగంగా గ్రీన్ స్కార్పియోవాహనంలో వచ్చి న్యాయవాదిని ఆయన ఇంటివద్దే కారుతో ఢీకొట్టి హత్య చేశారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. మొయిజుద్దీన్ హత్య కోసం రూ.15లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నిందితులు జనవరి నుంచి న్యాయవాది కదలికలపై రెక్కీ నిర్వహించారు. హత్య కోసం ప్రత్యేకంగా సెకండ్‌హ్యాండ్ స్కార్పియో వాహనాన్ని రూ.2లక్షలు పెట్టి కొన్నారని సీపీ చెప్పారు.
మలక్‌పేట, లక్డీకాపూల్‌లోని వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణ సమస్యలకు సంబంధించి నిందితుడు ముజాహిద్ ఆలంఖాన్‌కు , మృతుడు మొయిజుద్దీన్‌కు మధ్య సుదీర్థకాలంగా వివాదాలు ఉన్నాయని సీపీ తెలిపారు. ఈ రెండు వర్గాల మధ్య చాలా సంవత్సరాలుగా అనేక సివిల్, క్రిమినల్ కేసుల, వక్ఫ్ ట్రిబ్యునల్ కొనసాగుతున్నాయి. తమపై జరుగుతున్న పలు న్యాయపరమైన విచారణలలో మొయిజుద్దీన్ తరచుగా పాల్గొనడం, తమకు నిరంతరం ఎదురుదెబ్బలు తగలడంతో ముజాహిద్ ఆలంఖాన్ అతని తండ్రి మహమూద్ ఆలంఖాన్ అతనిని హతమార్చడానికి కుట్రపన్నారు. వక్ఫ్ భూముల విషయంలో అడ్వకేట్ మొయిజుద్దీన్, ఆలంఖాన్ మధ్య వివాదం నడుస్తున్నదని చెప్పారు.
దశాబ్దాల నుంచి వీరి మధ్య ఈ అంశంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. హత్య జరిగిన తర్వాత మొయిజుద్దీన్ కుమారుడు ఎం.ఎస్.ఫర్హాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని, ప్రత్యేక బృందాలతో వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హరియాణాలోని పానిపట్‌లో కిషన్ అలియాస్ పప్పును అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించే క్రమంలో తమ కుట్రను బయటపెట్టాడు. కిషన్ చెప్పిన సమాచారం, సాంకేతిక ఆధారాల సహకారంతో మిగతావారిని అరెస్ట్ చేశామన్నారు.
దర్యాప్తులో భాగంగా సికింద్రాబాద్‌లోని పంచవటిలాడ్జ్, నారాయణగూడలోని మెహఫిల్ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత నిందితులను గుర్తించామని సజ్జనార్ తెలిపారు. నేరం జరిగిన తర్వాత నిందితులు ఘటనాస్థలం నుంచి పారిపోయి వాహనంపై ఉన్న గుర్తులను చెరిపివేసి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. నిందితులను మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, అబిడ్స్ డివిజన్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్, నాంపల్లి ఇన్స్పెక్టర్ సీహెచ్ సైదులు, ఎస్ఐ అదిల్ రియాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.