సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): వేసవిలో వచ్చే హీట్ ఫీవర్స్, వడదెబ్బ, డయేరియా తదితర వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రేటర్ వైద్యాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని బస్తీ దవాఖాన స్థాయి నుంచి ఉస్మానియా, గాంధీ వంటి ట్రెషరీ దవాఖాన వరకు అన్ని ఆరోగ్యకేంద్రాల్లో రోగులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వేసవి తాపం వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతుండటంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, వేడిగాల్పులు వీచే అవకాశముందని, దీని వల్ల హీట్ ఫీవర్స్ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
అందుబాటులో మందులు..
వడదెబ్బ, హీట్ ఫీవర్స్, డయేరియా తదితర సమస్యలతో బాధపడే రోగులకు బస్తీ దవాఖానలతో పాటు ప్రాథమిక, పట్టణ ప్రాథమిక, ఏరియా, జిల్లా దవాఖానలు, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ వంటి ట్రెషరీ దవాఖానల్లో చికిత్స అందుబాటులో ఉంటుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి తెలిపారు. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు, ముఖ్యంగా ఎండ తీవ్రత వల్ల రోగులు నిర్జలీకరణకు గురవకుండా ఉండేందుకు అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఎన్ఎస్, డీఎన్ఎస్ తదితర స్లైన్ బాటిళ్లు తదితరాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఎండలో బయటకు రావొద్దు…
ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల మధ్య అత్యవసరమైతే తప్పా బయటకు రాకపోవడం మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితిలో రావాల్సి వస్తే ఎండ నేరుగా శరీరానికి తగలకుండా తలకు టోపీ పెట్టుకోవడం, గొడుగు పట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. తరచూ నీరు తాగుతుండాలి. కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండి, కొబ్బరి నీళ్లు , చెరుకు రసం, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవడం మంచిది.