అబిడ్స్, డిసెంబర్ 14: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటో తేదీ నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేపడుతున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ పేర్కొన్నారు. సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు అవసరమైన అనుమతులు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు.
ఇంకా పదహారు రోజులు మిగిలి ఉండటంతో స్టాళ్ల కేటాయింపు ప్రక్రియను చేపడుతున్నామని, మైదానంలో దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఇప్పటికే స్టాళ్ల కోసం దాదాపు మూడు వేల వరకు దరఖాస్తులు అందాయని వివరించారు. ఫుడ్, అమ్యూజ్మెంట్ పార్క్‌లతో పాటు అన్ని రకాల స్టాళ్ల ఏర్పాటుకు గాను దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని, ప్రదర్శన పకడ్బందీగా నిర్వహించేందుకు గాను సొసైటీ సభ్యులతో ఇప్పటికే 30 సబ్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
మూడు ప్రవేశ మార్గాల ద్వారా సందర్శకులను ఎగ్జిబిషన్లోనికి అనుమతించడం జరుగుతుందని, ఎగ్జిబిషన్ నిర్వహణ సందర్భంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలను చేపడుతున్నామన్నారు. పోలీస్ శాఖతో పాటు సొసైటీకి చెందిన వాచ్ అండ్ వార్డ్, వాలంటీర్లు, అంతర్గత భద్రతా చర్యలు చేపడుతున్నామని, అంతే కాకుండా సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 25 లక్షల పైచిలుకు సందర్శకులు సందర్శించే అవకాశాలున్నాయన్నారు. ఎగ్జిబిషన్ సందర్శనకు రూ.40ల ప్రవేశ రుసుమని పేర్కొన్నారు.