Army Recruitment | కంటోన్మెంట్, జూలై 6 : యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జూలై 31 నుండి సెప్టెంబర్ 14 వరకు సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్లోని జోగిందర్ సింగ్ స్టేడియం (ఎక్స్ థాపర్ స్టేడియం)లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 10వ తరగతి, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 8వ తరగతి (హౌస్ కీపర్) కేటగిరీతో పాటు అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ) పోస్టుల నమోదు కోసం నియామక ర్యాలీ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ) జూలై 31న ఉదయం 6 గంటలలోపు జోగిందర్ సింగ్ స్టేడియంలో స్పోర్ట్స్ ట్రయల్స్ కోసం రిపోర్ట్ చేయాలని, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, స్విమ్మింగ్, డైవింగ్, వెయిట్ లిఫ్టింగ్‌తో సహా అథ్లెటిక్స్ రంగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ క్రీడాకారులు తమ సర్టిఫికెట్లతో పాటు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
అన్ని వర్గాలకు వయోపరిమితి 17½ నుండి 21 సంవత్సరాలు. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి విద్యార్హత 10వ తరగతి, మెట్రిక్ ఉత్తీర్ణత మొత్తం 45 శాతం మార్కులతో ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు డ్రైవర్ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పారు. అగ్నివీర్ క్లర్క్ కోసం, పది, ఇంటర్మీడియట్ పరీక్షలో ఏదైనా స్ట్రీమ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి అన్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి, తిరుమలగిరిలోని ప్రధాన కార్యాలయ ఏఓసీ సెంటర్లో కానీ అధికారిక వెబ్‌సైట్‌ని సంప్రదించాలని అధికారులు సూచించారు.