నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 27(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఇన్స్టాగ్రామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్‌తోపాటు సరస్వతి, రాజీవ్, మీనాకుమారి, అర్జున్ మేనమామ ప్రశాంత్‌ను 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు పోక్సో కోర్టు జడ్జి బుధవారం వెల్లడించారు.
జూబ్లీహిల్స్ పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితులను కస్టడీకి కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. నిందితులంతా కలిసి 25మంది ధనిక మైనర్ బాలికలను ట్రాప్ చేసి సుమారు రూ. 40లక్షలను వసూలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు పేర్కొన్నారు. అర్జున్ స్నేహితులైన హర్ష, జతిన్, శ్రీజిత్ సెల్ఫోన్ల ద్వారా అర్జున్, రాజీవ్ అమ్మాయిలను ట్రాప్ చేసినట్టు తెలిపారు. స్నేహితుల ఇన్స్టాగ్రామ్ వాడి అర్జున్ మోసాలకు పాల్పడినట్టు తెలిపారు. 25మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు తెలిపారు.
ప్పటివరకు మొత్తం 11మందిని నిందితులుగా రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు. గతేడాదిలోనే అర్జున్‌పై పోలీసులకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, గతంలో నమోదైన పోక్సో కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు అర్జున్ ఆ కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా మైనర్ బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్‌ను అర్జున్ ఫాలో అయ్యేవాడని అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పలుమార్లు మైనర్ బాలికపై లైంగిక చర్యలకు పాల్పడినట్టు తెలిపారు.
అంతేకాకుండా మూడు నెలల్లో పలు కారణాలు చెప్పి బాధితురాలి నుంచి రూ. 13 లక్షలను అర్జున్ పొందినట్టు విచారణలో వెల్లడైందని తెలిపారు. అర్జున్ తల్లి మీనాకుమారి బ్యాంక్ అకౌంట్లను అధికారులు సేకరించారు. బాధితురాలి నుంచి మీనాకుమారి అకౌంట్లో డబ్బులు జమ అయినట్టు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన మైనర్ బాలికతోపాటు మరో బాధితురాలు సైతం అర్జున్‌పై ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కేసు నమోదు అనంతరం నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు. మైనర్‌ను బ్లాక్ మొయిల్ చేసి రూ. 9 లక్షలు సరస్వతి వసూలు చేసినట్టు గుర్తించారు. నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందని తెలిపారు.
మరోసారి కస్టడీకి ఇవ్వరాదు : నిందితుల న్యాయవాది
ఇటీవల 5 రోజులపాటు తొలివిడుతలో భాగంగా ప్రధాన నిందితుడు అజాద్ అలియాన్ అర్జున్ను కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని, మరోసారి 7రోజుల కస్టడీకి అప్పగించాలని అధికారులు డిమాండ్ చేయడం అప్రస్తుతమని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తిచేశారని, విచారణ పేరిట నిందితుడిని కస్టడీకి కోరుతున్నారని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న పోక్సో కోర్టు తీర్పును జూన్ 1వ తేదీకి రిజర్వు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బెయిల్ పిటీషన్‌పైనా వాదనలు పూర్తయ్యాయని అదేరోజు తీర్పును వెల్లడించనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.