మణికొండ, మార్చి 29: మాటామాటా పెరిగి ఓ వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేటలోని నార్త్ స్టార్ అల్లూరా విల్లాస్‌లో కట్రగుంట ధర్మతేజకు విల్లా నంబర్ 24 ఉంది. ఇందులో కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన షేక్ బాషా(43) వంటవాడిగా పనిచేస్తున్నాడు. 15 రోజుల క్రితం విల్లాలో పీనుమల్ల కార్తీక్ డ్రైవర్‌గా చేరాడు.
శనివారం రాత్రి షేక్ బాషా, కార్తీక్ మధ్య భోజనం విషయంలో గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రమై షేక్ బాషా కత్తితో కార్తీక్‌పై తీవ్రంగా దాడిచేశాడు. ఈ దాడిలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.